World

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ.. నాసా (NASA) సంచలనం

వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ.. నాసా (NASA) సంచలనం సృష్టించింది.. సరికొత్త చరిత్రకు నాంది పలికింది. ఇప్పటివరకు విశ్వాంతరాల మీద అనేక రకాల పరిశోధనలను సాగించిన నాసా..

ఇక తన దృష్టిని గ్రహ శకలాలపై సారించింది. అస్టరాయిడ్స్‌ పై సమగ్ర అధ్యయనానికి శ్రీకారం చుట్టింది.

ఆ అస్టరాయిడ్ (Asteroid) పేరు బెన్ను. 1999 సెప్టెంబర్ 11వ తేదీన దీన్ని తొలిసారిగా గుర్తించింది నాసా. కార్బోనేషియస్ గ్రహశకలం ఇది. దీని విస్తీర్ణం 565 మీటర్లు. సెకెనుకు 28 కిలోమీటర్ల వేగంతో ఈ అస్టరాయిడ్ ప్రయాణం సాగుతోంది. దీని వేగాన్ని దృష్టిలో ఉంచుకుని ఈజిప్ట్ మైథాలజీలో ఉన్న బెన్ను అనే పక్షి పేరును పెట్టారు.

4.5 బిలియన్ సంవత్సరాల పురాతన గ్రహశకలంగా నిర్ధారించింది నాసా. ఈ గ్రహ శకలం భూమిని ఢీ కొట్టే ప్రమాదం ఉందని నాసా అంచనా వేస్తోంది. 2,182వ సంవత్సరం సెప్టెంబర్‌లో ఈ బెన్ను (Bennu) అస్టరాయిడ్ భూమిని ఢీ కొడుతుందని భావిస్తోంది. ఈ గ్రహ శకలంపై సమగ్ర అధ్యయనం చేపట్టింది నాసా. అందులో ఉండే ఖనిజాలు, ద్రవ్యరాశి, కక్ష్య, విస్తీర్ణం.. గురించి ఆరా తీయాలని నిర్ణయించింది.

దీనికోసం 2018 డిసెంబర్ 3వ తేదీన ఒసిరిస్- రెక్స్ (Osiris-REx) అనే స్పేస్ క్రాఫ్ట్‌ను ప్రయోగించింది. గ్రహశకలంపై అధ్యయానికి నాసా తొలి అడుగు వేసిందక్కడే. ప్రయోగించిన రెండు సంవత్సరాల తరువాత అంటే 2020 అక్టోబర్‌లో ఈ స్పేస్ క్రాఫ్ట్.. బెన్ను అస్టరాయిడ్‌పై విజయవంతంగా ల్యాండ్ అయింది.

అస్టరాయిడ్ ఉపరితలాన్ని డ్రిల్ చేసి, మట్టి, రాళ్లను సేకరించింది. సుమారు ఏడాది కాలం పాటు ఈ గ్రహ శకలం మీదే తిష్ట వేసిందా స్పేస్ క్రాఫ్ట్. 2021 మే 10వ తేదీన ఈ ఒసిరిస్- రెక్స్ స్పేస్ క్రాఫ్ట్ భూమికి తిరుగు ప్రయాణం కట్టింది. కొద్దిసేపటి కిందటే అమెరికాలోని ఉటాలో భూమికి చేరింది.

ఈ విషయాన్ని నాసా వెల్లడించింది. ఒసిరిస్- రెక్స్ స్పేస్ క్రాఫ్ట్.. ల్యాండింగ్ దృశ్యాలను చిత్రీకరించింది నాసా. దీనికి సంబంధించిన ఓ వీడియోను విడుదల చేసింది. ఓ గ్రహ శకలం శాంపిల్స్ భూమిపైకి తీసుకుని రావడం ఇదే తొలిసారి. ఇందులో ప్రమాదకరమైన వైరస్‌, బ్యాక్టీరియా వంటివి ఉండవని రోవాన్ యూనివర్శిటీ ప్రొఫెసర్ హెరాల్డ్ కొన్నోల్లీ తెలిపారు.