World

వారసురాలికి యుద్ధ తంత్రాల్లో శిక్షణ: కుమార్తెతో కలిసి ట్యాంకర్‌పై కిమ్ జోంగ్ ఉన్ షికారు

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మరోసారి తన వింత చర్యలతో అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించారు. తన 13 ఏళ్ల కుమార్తె కిమ్ జు యేతో కలిసి ఆయన ఒక ఆర్మీ ట్రైనింగ్ యూనిట్‌ను సందర్శించారు. వీరిద్దరూ నలుపు రంగు లెదర్ జాకెట్లు ధరించి, యుద్ధ ట్యాంక్ హ్యాచ్ నుంచి బయటకు వచ్చి నవ్వుతూ కనిపిస్తున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేవలం సందర్శనకే పరిమితం కాకుండా, ట్యాంకర్ లోపల కూర్చుని లైవ్ ఫైరింగ్ డ్రిల్స్‌ను పర్యవేక్షించడం ద్వారా తన కుమార్తెకు సైనిక వ్యవహారాల్లో ప్రత్యక్ష శిక్షణ ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది.

కిమ్ జు యే 2022 నుంచి తన తండ్రితో కలిసి వరుసగా అధికారిక కార్యక్రమాలు, మిలటరీ పరేడ్‌లలో కనిపిస్తున్నారు. ఇటీవల ఆమె స్నైపర్ రైఫిళ్లను ఎక్కుపెట్టి వార్తల్లో నిలవగా, ఇప్పుడు యుద్ధ ట్యాంకర్ల నిర్వహణలో పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. కిమ్ జోంగ్ ఉన్ తన వారసురాలిగా కూతురిని తీర్చిదిద్దుతున్నారనే ఊహాగానాలకు ఈ పర్యటన మరింత బలాన్ని చేకూర్చింది. ఉత్తర కొరియా పాలకవర్గంలో ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు చర్చ జరుగుతున్నప్పటికీ, కిమ్ మాత్రం ఆమెను కీలక రక్షణ కార్యక్రమాల్లో భాగస్వామిని చేస్తున్నారు.

మరోవైపు, ఉత్తర కొరియాలో ఇటీవల జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో కిమ్ జోంగ్ ఉన్ నేతృత్వంలోని కొరియా వర్కర్స్ పార్టీ 99.93 శాతం ఓట్లను సాధించి రికార్డు సృష్టించింది. దేశంలోని ఓటర్లలో దాదాపు అందరూ కిమ్‌కు మద్దతు తెలపడం విశేషం. ఈ అఖండ విజయం తర్వాత కిమ్ తన కుటుంబం నుంచి తదుపరి నాయకత్వాన్ని సిద్ధం చేసే పనిలో పడ్డారు. అమెరికా మరియు దక్షిణ కొరియాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో, ఈ తండ్రీకూతుళ్ల యుద్ధ ట్యాంక్ పర్యటన ప్రపంచ దేశాలకు ఒక బలమైన సంకేతాన్ని పంపినట్లయింది.