పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద భూములు కోల్పోయిన నాగర్‌కర్నూల్ జిల్లా రైతులు కుషాయిగూడలో మంగళవారం ఆందోళన చేపట్టారు. ఓం శ్రీ సాయిరాం ఫైనాన్స్ సంస్థ పేరుతో తమకు సంబంధించిన సుమారు రూ.250 కోట్ల నష్టపరిహారం డబ్బులు మోసపూరితంగా కొల్లగొట్టారని ఆరోపించారు.సుమారు 25 గ్రామాలకు చెందిన వందలాది మంది బాధిత రైతులు కుషాయిగూడ సుభాష్‌నగర్‌లో నివసిస్తున్న నిందితుడు ధనుంజయ్ గుప్తా ఇంటి ముందు బైఠాయించి ధర్నాకు దిగారు. తక్కువ ధరకు భూములు ఇప్పిస్తామని, అధిక వడ్డీ ఇస్తామని నమ్మబలికి తమ డబ్బులు దోచుకున్నారని రైతులు తెలిపారు.
న్యాయం చేయాలని డిమాండ్..
ఈ వ్యవహారంపై ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించగా, నిందితుల ఆస్తులను జప్తు చేసినట్లు సమాచారం. అయినప్పటికీ తమకు న్యాయం జరగలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు సంఘీభావంగా పాశం యాదగిరి మద్దతు తెలిపారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని, భూములు కోల్పోయిన రైతులకు ఆర్ & ఆర్ ప్యాకేజీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం, పోలీసులు తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు.

