TELANGANA

ఆర్టీసీ సమ్మె.. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న బస్సు డ్రైవర్..

వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ డిపో వద్ద గురువారం నాడు పెను ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వ మొండివైఖరి, పోలీసుల అణచివేత ధోరణిని నిరసిస్తూ శంకర్ గౌడ్ అనే డ్రైవర్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పుంటించుకున్నాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా డిపో పరిసరాలు రణరంగంగా మారాయి.

 

సమ్మెలో భాగంగా ఉదయం నుండి కార్మికులు డిపో ముందు శాంతియుతంగా ధర్నా నిర్వహించేందుకు ప్రయత్నించారు. పోలీసులు భారీగా మోహరించి కార్మికులను అడ్డుకున్నారు. తమ నిరసనను తెలిపే కనీస హక్కును కూడా కాలరాస్తున్నారన్న ఆవేదనతో డ్రైవర్ శంకర్ గౌడ్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. అందరూ చూస్తుండగానే వెంట తెచ్చుకున్న పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో తోటి కార్మికులు, పోలీసులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. వెంటనే అప్రమత్తమైన వారు మంటలను ఆర్పివేశారు.

 

తీవ్ర గాయాలపాలైన శంకర్ గౌడ్ పరిస్థితి విషమంగా ఉండటంతో అతడిని వెంటనే నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ వార్త తెలియడంతో వరంగల్ జిల్లావ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ కార్మికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ప్రభుత్వమే తమను చావుల వైపు నెడుతోందని కార్మికులు నినాదాలు చేశారు. ఆసుపత్రి వద్దకు భారీగా తరలివచ్చిన కార్మికులు శంకర్ గౌడ్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ఈ ప్రాంతంలో అదనపు బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.