TELANGANA

ఇక మా టైం మొదలైంది.. కవిత ట్వీట్ వైరల్..

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత తన కొత్త రాజకీయ ప్రయాణాన్ని అధికారికంగా ప్రారంభించారు. ‘తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్‌ఎస్)’ పేరుతో కొత్త పార్టీని ప్రకటించిన ఆమె, ఆ తర్వాత చేసిన తొలి ట్వీట్ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ‘మీ టైం పూర్తయ్యింది.. మా టైం మొదలైంది” అంటూ ఎక్స్‌లో ఆమె పోస్టు పెట్టారు.

 

శనివారం హైదరాబాద్‌లోని మునీరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కవిత తన పార్టీ పేరును అధికారికంగా ప్రకటించడం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాజకీయాల్లో తన పార్టీ ఒక కొత్త శక్తిగా ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస్తున్న కవిత, ఎట్టకేలకు సొంత పార్టీతో ప్రజల ముందుకు వచ్చారు.

 

ఈ పరిణామంలో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, తన తండ్రి కేసీఆర్ స్థాపించిన పార్టీ అసలు పేరు ‘తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్)’ని పోలి ఉండేలా ‘తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్‌ఎస్)’ అని నామకరణం చేయడం. బీఆర్‌ఎస్‌ నుంచి వేరుగా, సొంత రాజకీయ అస్తిత్వం కోసం కవిత ఈ నిర్ణయం తీసుకోవడం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఆమె చేసిన ట్వీట్, ఎవరిని ఉద్దేశించిందనే దానిపై ఊహాగానాలు మొదలయ్యాయి.