పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఒమన్‌లోని షినాస్ ఓడరేవు సమీపంలో భారతీయ నావికులున్న ఒక రసాయన ట్యాంకర్‌పై ఇరాన్ కోస్ట్ గార్డ్ కాల్పులు జరిపినట్లు భారత ఓడరేవులు, షిప్పింగ్ మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. టోగో దేశ జెండాతో ప్రయాణిస్తున్న ‘ఎంటీ సైరన్’ అనే ఈ ట్యాంకర్‌లోకి కొందరు వ్యక్తులు ప్రవేశించినట్లు తెలిపింది.
ఏప్రిల్ 25న ఈ ఘటన జరిగిందని, ఆ సమయంలో ఆ నౌక సమీపంలో ఇతర నౌకలు కూడా ఉన్నాయని షిప్పింగ్ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ మందీప్ సింగ్ రణధావా తెలిపారు. పశ్చిమాసియాలో తాజా పరిణామాలపై జరిగిన అంతర్-మంత్రిత్వ శాఖల సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. ఇరాన్ కోస్ట్ గార్డ్ హెచ్చరికగా ఈ కాల్పులు జరిపినట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ ప్రాంతంలో భారత నావికుల భద్రత, నౌకల కార్యకలాపాల కొనసాగింపు కోసం విదేశాంగ శాఖ, భారత రాయబార కార్యాలయాలతో కలిసి నిరంతరం సమన్వయం చేసుకుంటున్నామని రణధావా వివరించారు. డీజీ షిప్పింగ్ కంట్రోల్ రూమ్ ఇప్పటివరకు 7,780 కాల్స్, 16,650 ఈమెయిళ్లను స్వీకరించిందని, 2,770 భారత నౌకలతో సంప్రదింపులు జరుపుతోందని తెలిపారు. “ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాం” అని ఆయన స్పష్టం చేశారు.
ఇటీవలి కాలంలో ఇరాన్ నుంచి ఇటువంటి దాడులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఏప్రిల్ 22న భారత్‌లోని ముంద్రా పోర్టుకు వస్తున్న ఒక నౌకపై, అలాగే ఏప్రిల్ 18న హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న రెండు భారత నౌకలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. ఈ ఘటనలపై భారత్ అప్పట్లోనే ఇరాన్‌కు తీవ్ర నిరసన తెలిపింది. అయితే, అనుమతి లేకుండా తమ జలాల్లోకి ప్రవేశించడం వల్లే దాడి చేశామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ నేవీ (ఐఆర్జీసీ-ఎన్) ప్రకటించింది.

