రాష్ట్రంలో ప్రభుత్వ శాఖలు అందించే ప్రతీ సేవను ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తిగా ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అన్ని సేవలను ‘మన మిత్ర’ వాట్సప్ గవర్నెన్స్ పరిధిలోకి తీసుకువస్తే, ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే శ్రమ తప్పుతుందని ఆయన స్పష్టం చేశారు. బుధవారం నాడు అమరావతిలోని తన క్యాంపు కార్యాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజీఎస్) పనితీరుపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా టెక్నాలజీని ప్రభుత్వ పాలనలో విరివిగా వినియోగించుకోవడంపై పలు కీలక నిర్దేశాలు చేశారు.
ప్రస్తుతం ‘మన మిత్ర’ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 1,035 సేవలను అందిస్తున్నామని, ఈ విధానం ప్రారంభమైన నాటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా 54 లక్షల మంది పౌరులు 1.78 కోట్ల సేవలను వినియోగించుకున్నారని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సేవలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఇప్పటివరకు 24 లక్షల మందికి పైగా వాట్సాప్ ద్వారా సేవలు ఎలా పొందాలో శిక్షణ ఇచ్చామని తెలిపారు. ఈ పురోగతిని అభినందించిన ముఖ్యమంత్రి, మిగిలిన అన్ని సేవలను కూడా నిర్దేశిత గడువులోగా ఆన్‌లైన్ వేదికపైకి తీసుకురావాలని స్పష్టం చేశారు.
శరవేగంగా డ్రోన్ సిటీ.. జూలైకి తొలి దశ పూర్తి చేయాలి
కర్నూలు జిల్లాలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న డ్రోన్ సిటీ మొదటి దశ పనులు శరవేగంగా జరుగుతున్నాయని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. ఇప్పటికే డ్రోన్ సిటీ మాస్టర్ ప్లాన్ ఖరారైందని, ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన 8 కంపెనీలకు భూముల కేటాయింపు ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. మే నెల రెండో వారంలో ఈ కంపెనీలు తమ నిర్మాణ పనులను ప్రారంభించనున్నాయని వివరించారు.
దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి, డ్రోన్ సిటీ మొదటి దశ పనులను ఈ ఏడాది జూలై నాటికి కచ్చితంగా పూర్తి చేయాలని గడువు విధించారు. ఇది రాష్ట్రానికి టెక్నాలజీ రంగంలో గర్వకారణంగా నిలుస్తుందని ఆకాంక్షించారు.
నేర నియంత్రణ, శాటిలైట్ డేటా వినియోగంపై దృష్టి
రాష్ట్రంలో నేరాల నియంత్రణకు సీసీ కెమెరాల వ్యవస్థ ఎంతగానో ఉపయోగపడుతోందని అధికారులు తెలిపారు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌లో సీసీ కెమెరాల ఏర్పాటు, వాటి పర్యవేక్షణ అత్యుత్తమంగా ఉందని, దీని ఫలితంగా నేరాలను నియంత్రించడం, నేరస్తులను గుర్తించడం, మిస్సింగ్ కేసులు, వాహనాల దొంగతనాల వంటివి వేగంగా పరిష్కారం అవుతున్నాయని వివరించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ప్రభుత్వ కెమెరాలతో పాటు, సీసీ కెమెరాలు లేని ప్రాంతాల్లో ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలు ఏర్పాటు చేసుకున్న కెమెరాల డేటాను కూడా ప్రభుత్వ వ్యవస్థతో ఇంటిగ్రేట్ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు.
అదేవిధంగా, శాటిలైట్ డేటాను ఆర్టీజీఎస్‌కు అనుసంధానించి, విపత్తులు లేదా అత్యవసర పరిస్థితులను ముందుగానే పసిగట్టి, వేగంగా స్పందించేలా కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. ఇటీవల శేషాచల అడవుల్లో జరిగిన అగ్నిప్రమాదాన్ని ప్రస్తావిస్తూ, శాటిలైట్ సమాచారం ఉండి ఉంటే మరింత వేగంగా స్పందించే అవకాశం ఉండేదన్నారు.
అలాగే, ఇటీవల తలెత్తిన ఇంధన సరఫరా సమస్యను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించిందని, అయితే ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కాకముందే రియల్ టైమ్‌లో గుర్తించి, నివారించే దిశగా సాంకేతికతను వాడుకోవాలని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు.

