AP

ఏపీ క్యాబినెట్ తీసుకున్న 41 కీలక నిర్ణయాలు ఇవే..!

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం ముగిసింది. ఈ భేటీలో పలు శాఖలకు సంబంధించి మొత్తం 41 కీలక అంశాలపై ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. హోంశాఖ, న్యాయ, పంచాయతీరాజ్, పరిశ్రమలు, పురపాలక, జలవనరులు, రెవెన్యూ వంటి అనేక శాఖలకు సంబంధించిన ప్రతిపాదనలకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. సమావేశం అనంతరం ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మీడియాకు వివరాలు వెల్లడించారు.

 

క్యాబినెట్ తీసుకున్న 41 కీలక నిర్ణయాలు ఇవే…

 

1. 23 ఏళ్లుగా పదోన్నతులు లేకుండా కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న 385 మందికి హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పిస్తూ వారి పోస్టులను అప్‌గ్రేడ్ చేయడానికి ఆమోదం.

 

2. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని న్యాయ విభాగాల్లో 5 చీఫ్ కోర్ట్ మేనేజర్, 15 సీనియర్ కోర్ట్ మేనేజర్ పోస్టులతో సహా మొత్తం 21 కొత్త పోస్టుల సృష్టికి ఆమోదం.

3. న్యూఢిల్లీలోని ఏపీ భవన్‌లో అడ్వకేట్ ఆన్ రికార్డ్ కార్యాలయం కోసం ఒక ఆఫీస్ మేనేజర్ పోస్టును కొత్తగా ఏర్పాటు చేయడానికి నిర్ణయం.

 

4. ఉపయోగంలో లేని 20 పోస్టులను రద్దు చేసి, పరిశోధన సంస్థల్లో అవసరమైన చోట 20 కొత్త పోస్టులను సృష్టించడానికి ఆమోదం.

 

5. రామాయపట్నం గ్రీన్‌ఫీల్డ్ పోర్టు నిర్మాణంలో భాగంగా డ్రెడ్జింగ్, పర్యావరణ నిబంధనల మేరకు అదనపు పనుల కోసం రూ.354.23 కోట్లకు పరిపాలన అనుమతి. ఇది మొత్తం ప్రాజెక్టు వ్యయంలోనే సర్దుబాటు అవుతుంది.

 

6. మార్క్‌ఫెడ్ రూ.1800 కోట్ల వర్కింగ్ క్యాపిటల్ లోన్ తీసుకునేందుకు ప్రభుత్వ గ్యారెంటీకి క్యాబినెట్ ఆమోదం.

 

7. ఢిల్లీలోని 11.53 ఎకరాల స్థలంలో ఆంధ్రప్రదేశ్ సంస్కృతిని ప్రతిబింబించేలా రూ.124.5 కోట్లతో కొత్త ఏపీ భవన్ నిర్మాణానికి ఆమోదం. నిర్మాణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్‌బీసీసీకి అప్పగింత.

 

8. రాష్ట్రంలోని వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టులకు 2 శాతం రిజిస్ట్రేషన్ ఛార్జీల నుంచి మినహాయింపు. దీనివల్ల రూ.25 కోట్ల విలువైన ప్రాజెక్టులకు లబ్ధి.

 

9. పురపాలక సంఘాల్లోని షాపింగ్ కాంప్లెక్స్‌ల లీజుకు సంబంధించి ఏకరీతి విధానం. ప్రతి ఏటా 7% అద్దె పెంచేలా నిబంధన.

 

10. కమర్షియల్ కాంప్లెక్స్‌లలో గ్రౌండ్ ఫ్లోర్‌తో పోలిస్తే ఫస్ట్ ఫ్లోర్‌పై 20 శాతం, సెకండ్ ఫ్లోర్‌పై 30 శాతం తక్కువ అద్దె ఉండేలా నూతన విధానం.

 

11. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలలో ఆస్తిపన్నుకు సంబంధించి ఏకరీతి ఆటో మ్యూటేషన్ ఛార్జీల విధానానికి ఆమోదం.

 

12. కృష్ణా నది కుడిగట్టు (కరకట్ట) పటిష్టత, విస్తరణ పనులకు రూ.443 కోట్లతో సవరించిన అంచనాలకు ఆమోదం. గతంలో కాంక్రీట్ వాల్ కోసం వేసిన రూ.1304 కోట్ల అంచనాను రద్దు చేశారు.

 

13. అమరావతిలో సెక్రటేరియట్, హెచ్‌ఓడీ, జీఏడీ టవర్ల నిర్మాణంలో గ్లాస్ క్లాడింగ్, క్రౌన్, ఇతర పనుల కోసం రూ.2540 కోట్లకు పరిపాలన ఆమోదం.

 

14. అమరావతిలో 43 అంతస్తులతో రెండు క్వాంటం టవర్ల (ట్విన్ టవర్స్) షెల్ అండ్ కోర్ నిర్మాణానికి రూ.1208 కోట్లకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్.

 

15. అసెంబ్లీ భవనం సెంట్రల్ స్పైర్, పార్కింగ్, అప్రోచ్ బ్రిడ్జిల నిర్మాణానికి రూ.798 కోట్లకు పరిపాలన అనుమతి.

 

16. ఉండవల్లి (జోన్-2) లేఅవుట్లలో రోడ్లు, డ్రైన్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు రూ.580 కోట్లకు ఆమోదం.

 

17. సీఆర్‌డీఏ పరిధిలో ఎన్10-ఎన్13 జంక్షన్ల వద్ద అండర్‌గ్రౌండ్ కేబుల్ రీ-రూటింగ్ కోసం సవరించిన అంచనా రూ.1180.54 కోట్లకు ఆమోదం.

 

18. గతంలో రెవెన్యూ శాఖకు బదలాయించిన సీఆర్‌డీఏ భూములను (ఆర్-5 జోన్‌తో సహా) తిరిగి సీఆర్‌డీఏకు అప్పగించడానికి క్యాబినెట్ నిర్ణయం.

 

19. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద రైతుల కౌలు పెంపు, కటాఫ్ తేదీ పొడిగింపు వంటి అభ్యర్థనలకు ఆమోదం.

 

20. సీఆర్‌డీఏ భూ కేటాయింపులు: సెబీకి 1.5 ఎకరాలు.

 

21. స్వామినారాయణ గురుకులానికి పాఠశాల కోసం భూమి.

 

22. ఫైర్ డిపార్ట్‌మెంట్‌కు భూమి.

 

23. డీఏవీ పబ్లిక్ స్కూల్‌కు భూమి కేటాయింపులకు క్యాబినెట్ ఆమోదం.

 

24. పోలవరం నిర్వాసితులకు అదనపు ప్యాకేజీ కింద సొంతంగా ఇల్లు కట్టుకునే వారికి యూనిట్ ధర రూ.3.57 లక్షలకు పెంపు.

 

25. ఆర్‌అండ్‌ఆర్ కాలనీ బయట ఇల్లు కట్టుకునే వారికి హౌస్ సైట్ కోసం ఇచ్చే మొత్తాన్ని రూ.లక్ష నుంచి రూ.2 లక్షలకు పెంపు.

 

26. పుష్కర ఎత్తిపోతల పథకంలో ఎస్కేప్ ఛానల్ నిర్మాణం కోసం రూ.4.71 కోట్లను నామినేషన్ పద్ధతిపై కేటాయించేందుకు ఆమోదం.

 

27. హంద్రీనీవా సుజల స్రవంతి పుంగనూరు బ్రాంచ్ కెనాల్ ఆధునికీకరణ పనులకు సవరించిన అంచనా రూ.309 కోట్లకు ఆమోదం.

 

28. తిరుపతి జిల్లా రేణిగుంటలో స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు కోసం సన్‌రైజ్ ఎడ్యుకేషనల్ ఇనిషియేటివ్స్‌కు మార్కెట్ ధరకు 10 ఎకరాల భూమి కేటాయింపు.

 

29. కడప నగరంలో ఆధునిక డంపింగ్ యార్డ్ కోసం మున్సిపల్ కార్పొరేషన్‌కు 92 ఎకరాల భూమి బదలాయింపు.

 

30. ప్రకాశం జిల్లాలో ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ హబ్ కోసం మార్కెట్ విలువకు 22 ఎకరాల భూమి.

 

31. చిత్తూరు జిల్లా యాదమరి మండలంలో ఫ్రూట్ ప్యాకింగ్ యూనిట్ కోసం ఏపీ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్‌కు 13 ఎకరాల కేటాయింపు.

 

32. అనంతపురం-హిందూపురం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (అహుడా)కి ఎంఐజీ లేఅవుట్ కోసం 11 ఎకరాల భూమికి ఆమోదం.

 

33. కాకినాడ జిల్లా ఏలేశ్వరం రిజర్వాయర్‌లో కేజ్ కల్చర్ కోసం ‘ఫిష్ ఇన్ ఇండియా’ సంస్థకు 10 ఎకరాల ప్రభుత్వ భూమిని లీజుకు ఇవ్వడానికి నిర్ణయం.

 

34. కాకినాడ అర్బన్‌లో కోర్టు కాంప్లెక్స్, నివాస భవనాల కోసం ప్రభుత్వ భూమి కేటాయింపు.

 

35. విజయనగరం, ఒంగోలు, కర్నూలు, తూర్పుగోదావరి, ఏలూరు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో టీడీపీ కార్యాలయాల నిర్మాణానికి 33 ఏళ్ల లీజు ప్రాతిపదికన భూమి కేటాయింపు.

 

36. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో భోగరాజు పట్టాభి సీతారామయ్య మెమోరియల్ ట్రస్ట్ కోసం 1.5 ఎకరాల ప్రభుత్వ భూమిని లీజుకు ఇవ్వడానికి ఆమోదం.

 

37. కొప్పర్తి ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో నీటి సరఫరా పనుల కోసం ఏపీఐఐసీ తీసుకున్న రూ.75 కోట్ల రుణ ప్రతిపాదనకు రాటిఫికేషన్.

 

38. సత్యసాయి జిల్లాలో డిఫెన్స్ పరిశ్రమ ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థ డీఆర్డీవోకు దాదాపు 600 ఎకరాల భూమి కేటాయింపునకు సూత్రప్రాయ అంగీకారం.

 

39. బుడగట్లపాలెం, పూడిమడక, కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి సవరించిన అంచనా రూ.1586 కోట్లకు ఆమోదం.

 

40. కిసాన్ డ్రోన్ల వినియోగం కోసం మిగిలిన కేంద్ర నిధులను (~రూ.14 కోట్లు) వాడుకునేందుకు పాత సంస్థకే కాంట్రాక్టు పొడిగింపు.

 

41. డిస్కంలు ఆర్‌ఈసీ నుంచి తీసుకునే రూ

.7000 కోట్ల రుణానికి ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీని పొడిగించడానికి క్యాబినెట్ ఆమోదం.