TELANGANA

రైతు సంగ్రామ సదస్సులో కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన కేటీఆర్..

వరంగల్ వేదికగా జరిగిన ‘రైతు సంగ్రామ సదస్సు’లో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. వరంగల్ జిల్లా కాకతీయ పౌరుషాల గడ్డ అని కొనియాడిన కేటీఆర్, ఇక్కడి నుంచే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని ప్రకటించారు. నాలుగేళ్ల క్రితం వరంగల్‌లో కాంగ్రెస్ ప్రకటించిన ‘రైతు డిక్లరేషన్’ ఒక నయవంచన అని, అది కేవలం ఓట్ల కోసమే చేసిన ‘కొంగజపం’ అని ఆయన మండిపడ్డారు. డిక్లరేషన్‌లో ఇచ్చిన 34 హామీలను గాలికొదిలేశారని, వంద రోజుల్లోనే నెరవేరుస్తామని చెప్పి నెలలు గడుస్తున్నా అతీగతీ లేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ మాటలు నమ్మి ఓట్లు వేసిన రైతులు నేడు అరిగోస పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

 

రైతు డిక్లరేషన్‌ను ఒక బోగస్ చిత్తు కాగితంగా అభివర్ణించిన కేటీఆర్… ప్రభుత్వం నిర్వహిస్తున్న రైతు మేళాలను ‘దగా మేళాలు’గా సంబోధించారు. కేసీఆర్ హయాంలో ఎకరాకు రూ. 10 వేలు అందిస్తే, రూ. 15 వేలు ఇస్తామని నమ్మబలికిన కాంగ్రెస్.. నేడు కనీసం ఉన్న సౌకర్యాలను కూడా అందించలేకపోతోందని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికి 69 సార్లు ఢిల్లీకి వెళ్లారని, కానీ రాష్ట్ర రైతు ప్రయోజనాల కోసం ఒక్క పైసా కూడా తీసుకురాలేదని ఆక్షేపించారు. రైతుల సహనాన్ని పరీక్షించవద్దని, వడ్ల కొనుగోళ్లలో జాప్యం జరిగితే కాంగ్రెస్ నేతలను గ్రామాల్లో రైతులు తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ఆయన హెచ్చరించారు.