ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక సంక్షోభాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. “నా దేశం – నా బాధ్యత” అనే నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ పొదుపు చర్యలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేందుకు సమాజం సిద్ధంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ ముందుజాగ్రత్త చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు.
ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల వల్ల ఇంధన దిగుమతులు, విదేశీ మారక ద్రవ్యంపై తీవ్ర ఒత్తిడి పడుతోందని, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు ఆటంకాలు ఏర్పడే ప్రమాదం ఉందని మంత్రి వివరించారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, పొదుపు చర్యలు పాటించడం ద్వారా దేశానికి మేలు చేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చినట్లు తెలిపారు.
ప్రజాప్రతినిధుల నుంచే మార్పు మొదలవ్వాలి..
ఈ పొదుపు చర్యలు తొలుత ప్రజాప్రతినిధులు, అధికారుల నుంచే ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని పార్థసారథి తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ కాన్వాయ్‌లలో వాహనాల సంఖ్యను గణనీయంగా తగ్గించుకోవాలని సూచించారు. అనవసర విదేశీ పర్యటనలను పూర్తిగా రద్దు చేసుకోవాలన్నారు. వీలైతే ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించుకోవాలని, సమీప ప్రాంతాలకు వెళ్లేటప్పుడు కార్లకు బదులుగా నడక లేదా సైకిల్‌ను ఆశ్రయించాలని సీఎం కోరారు.
వారానికి ఒక రోజు (శుక్రవారం) ‘నో వెహికల్ డే’ పాటించాలని, ఆ రోజు వాహనాలు వినియోగించకుండా వర్చువల్ విధానంలో సమావేశాలు నిర్వహించుకోవాలని సూచించారు. అధికారులు కూడా వాహనాలను షేర్ చేసుకోవడం ద్వారా ఇంధనాన్ని ఆదా చేయాలని కోరారు. ప్రభుత్వ శాఖల్లో ఇంధన వినియోగంపై వారానికోసారి సమీక్షించాలని, కొత్తగా కొనుగోలు చేసే వాహనాలు ఎలక్ట్రిక్ (ఈవీ) వాహనాలే అయి ఉండాలని క్యాబినెట్ నిర్ణయించింది.
ప్రజలకు, రైతులకు కీలక విజ్ఞప్తులు
ప్రజలు కూడా ఈ సంక్షోభ సమయంలో బాధ్యతగా వ్యవహరించాలని మంత్రి కోరారు. విహారయాత్రల కోసం విదేశాలకు వెళ్లే బదులు స్వదేశీ పర్యాటకాన్ని ప్రోత్సహించాలని సూచించారు. బంగారం కొనుగోళ్లపై మోజు తగ్గించుకోవాలని, దీనివల్ల ఏటా వేల కోట్ల డాలర్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందని అన్నారు. “స్టెప్ ఫర్ ది నేషన్” పేరుతో నడక, సైకిల్ వాడకాన్ని ప్రోత్సహించేందుకు ప్రచార కార్యక్రమాలు చేపడతామన్నారు.
ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. ముఖ్యంగా ఇంధన, వ్యవసాయ రంగాల్లో కీలక మార్పులకు శ్రీకారం చుట్టాలని సీఎం ఆదేశించారన్నారు. శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ‘పీఎం సూర్యఘర్’, ‘కుసుమ్’ వంటి సౌర విద్యుత్ పథకాలను మరింత వేగవంతం చేయాలని ఇంధన శాఖను ఆదేశించినట్లు చెప్పారు. ప్రస్తుతం లక్షల మందికి మాత్రమే చేరిన ఈ పథకాలను విస్తృతం చేసేందుకు అవసరమైన పరికరాల తయారీదారులతో, సప్లై చైన్‌తో చర్చలు జరపాలని సూచించారన్నారు. అలాగే, కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) వంటి ప్రత్యామ్నాయ ఇంధన ప్లాంట్ల ఏర్పాటుకు భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారన్నారు.
వ్యవసాయ రంగంలో రసాయనిక ఎరువుల వాడకం విపరీతంగా పెరిగిపోయిందని, ముఖ్యంగా యూరియా వినియోగంలో రైతుల మధ్య చాలా వ్యత్యాసం ఉందని పార్థసారథి ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు రైతులు ఎకరానికి రెండు బస్తాలు వాడుతుంటే, మరికొందరు మూడు, నాలుగు బస్తాలు వాడుతున్నారని, ఇది శాస్త్రీయంగా సరైంది కాదన్నారు.
అధిక దిగుబడి కోసం కెమికల్స్ వాడకం వల్ల భూసారం దెబ్బతింటోందని, దీన్ని తగ్గించేలా రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖకు సీఎం సూచించారని తెలిపారు. దీనికి ప్రత్యామ్నాయంగా వచ్చిన ‘నానో యూరియా’ వాడకాన్ని ప్రోత్సహించాలని కోరారు. డ్రోన్ల సహాయంతో నానో యూరియాను పొలం అంతటా సమానంగా చల్లడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చని, రైతులు ఈ దిశగా ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.
ముందు జాగ్రత్తే కానీ, భయం వద్దు
ఈ చర్యలన్నీ ప్రజలను భయపెట్టడానికి కాదని, కేవలం సంభావ్య సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి సమాజాన్ని సన్నద్ధం చేయడానికేనని మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు. “రాబోయే ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి తప్ప, ఆదాయం తగ్గిపోతుందని ఆలోచించకూడదు. దేశ ప్రయోజనాలే ముఖ్యం” అని ఆయన పేర్కొన్నారు. ఇంధన పొదుపు వల్ల రాష్ట్రానికి వచ్చే పన్ను ఆదాయం తగ్గవచ్చనే ప్రశ్నకు ఆయన ఈ విధంగా సమాధానమిచ్చారు.
ప్రభుత్వం ఇతర మార్గాల్లో ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తోందని, త్వరలోనే రాష్ట్రానికి రూ. 1.5 లక్షల కోట్ల భారీ పెట్టుబడులు రాబోతున్నాయని తెలిపారు. ఈ పొదుపు చర్యలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఐ&పీఆర్ శాఖ ద్వారా విస్తృత ప్రచారం నిర్వహిస్తామని మంత్రి కొలుసు పార్థసారథి వివరించారు.

