TELANGANA

బండి భగీరథ్ కేసులో హైకోర్టు సంచలనం..!

పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బాలిక మైనరా? కాదా? అన్న విషయంపై స్పష్టత లేకపోవడంతో.. దానిపై రీ-వెరిఫికేషన్ చేయాలని పోలీసులను ఆదేశించింది. అనంతరం మధ్యంతర బెయిల్ పై తీర్పును రేపు వెల్లడిస్తామని స్పష్టం చేసింది.

 

మైనర్ బాలిక పట్ల అమానుషంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ ను ఏ క్షణమైనా సిట్ అధికారులు అరెస్టు చేయవచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బండి భగరీథ్ ముందస్తు బెయిల్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టులో దాఖలు చేశారు. దీనిపై తాజాగా హైకోర్టు విచారణ చేపట్టగా.. భగీరథ్ తరపున ప్రముఖ లాయర్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. బాధితురాలి వయసు విషయంలో స్పష్టత లేదని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

 

బాధితురాలికి సంబంధించిన ఒక్కో సర్టిఫికేట్ లో ఒక్కో రకమైన డేట్ ఆఫ్ బర్త్ ఉన్నట్లు నిరంజన్ రెడ్డి హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ బాధితురాలి వయసుపై తిరిగి రీ-వెరిఫికేషన్ చేయాలని దర్యాప్తు అధికారులను ఆదేశించింది. అనంతరం విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

 

వాస్తవానికి బుధవారమే (మే 13వ తేదీ) బండి భగీరథ్ సిట్ అధికారుల విచారణకు హాజరు కావాల్సి ఉంది. 2 గంటల వరకూ డెడ్ లైన్ విధించినప్పటికీ భగీరథ్ వెళ్లలేదు. దీంతో అతడ్ని అదుపులోకి తీసుకోవడం ఖాయమన్న ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే సిట్ అధికారులకు భగీరథ్ ఓ లేఖ పంపారు. శుక్రవారం (మే 15) వస్తానని దర్యాప్తు అధికారులకు తెలియజేశారు. ఈ క్రమంలోనే మధ్యంతర బెయిల్ కోసం భగీరథ్ హైకోర్టును ఆశ్రయించడం కోర్టు కూడా తీర్పును రేపటికి వాయిదా వేయడంతో.. ఈ కేసులో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయన్న ఆసక్తి మెుదలైంది.