రాష్ట్రంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) శ్రేణులు రోడ్డెక్కాయి. గుంటూరు నగరంలో మాజీ మంత్రి, వైసిపి సీనియర్ నేత అంబటి రాంబాబు ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు.
రిక్షా తొక్కిన మాజీ మంత్రి..
ధరల పెంపుదలపై తన నిరసనను వినూత్నంగా తెలియజేసేందుకు అంబటి రాంబాబు స్వయంగా రంగంలోకి దిగారు. గుంటూరు కలెక్టరేట్ వద్ద ఆయన స్వయంగా రిక్షా తొక్కి ప్రభుత్వ నిర్ణయాన్ని ఎండగట్టారు. పెరిగిన ధరలతో సామాన్యుడు బతికే పరిస్థితి లేదని, అందుకే పాత కాలం నాటి రిక్షాలే దిక్కయ్యేలా ఉన్నాయంటూ ఆయన మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లోనే ఇంధన ధరలు విపరీతంగా పెంచేసి, ప్రజలపై మోయలేని భారం మోపారని ఆయన ధ్వజమెత్తారు.
లోకేష్ పేరుపై.. అంబటి సెటైర్లు!
ఈ సందర్భంగా ఐటీ మంత్రి నారా లోకేష్‌ను టార్గెట్ చేస్తూ అంబటి రాంబాబు తీవ్రమైన విమర్శలు, సెటైర్లు వేశారు. ‘ఆయన పేరు లోకేష్ కాదు.. ‘లవ్ కాష్’ అని పెట్టుకుంటే బాగుంటుంది’ అంటూ ఎద్దేవా చేశారు. అంతేకాదు, ‘లోకేష్ అన్నప్రాసన రోజే పాయసం కాకుండా.. క్యాష్ (డబ్బులు) పట్టుకున్నాడట, మరి ఇప్పుడు మాత్రం ఏం చేస్తాడు? అందుకే ఎక్కడ చూసినా డబ్బు వసూళ్లే కనిపిస్తున్నాయి’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం తాము పెరిగిన ధరలకు వ్యతిరేకంగా కేవలం శాంతియుత నిరసన మాత్రమే తెలియజేశామని, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ధరలు తగ్గించకపోతే ప్రజాక్షేత్రంలో వైసీపీ పోరాటం ఉధృతం చేస్తుందని అంబటి రాంబాబు హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు.

