బెంగాల్ లోని బీజేపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గత కొంతకాలంగా రాష్ట్రంలోని ఇమామ్‌లు, ముఅజ్జిన్‌లకు, హిందూ దేవాలయాల అర్చకులకు అందిస్తున్న నెలవారీ గౌరవ వేతనాలను రద్దు చేయాలని నిర్ణయించింది. ఇవాళ జరిగిన రాష్ట్ర మంత్రివర్గ తొలి సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు. అలాగే కోల్ కత్తా హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న వెనుకబడిన తరగతుల జాబితా (OBR)ను రద్దు చేసి.. కోటా అర్హతను నిర్ణయించడానికి కొత్త ప్యానెల్ ఏర్పాటు కేబినేట్ అమోదం తెలిపింది.
తొలి మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర మంత్రి అగ్నిమిత్ర పాల్ మీడియాకు వెల్లడించారు. మతపరమైన గౌరవ వేతనాలు.. జూన్ నుంచి నిలిపివేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు త్వరలోనే అధికారిక నోటిఫికేషన్ జారీ చేస్తామని ఆయన వెల్లడించారు. సంక్షేమ కార్యక్రమాలు.. మతాల ఆధారంగా ఉండకూడదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ నిధులను మతపరమైన కార్యక్రమాలకు కాకుండా ఇతర ప్రజా ఉపయోగాల కోసం మళ్లించడమే దీని ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోంది.
బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ.. మతపరంగా గౌరవ వేతనం అందించే పథకాన్ని 2012లో తొలిసారి ప్రవేశపెట్టారు. తొలుత బెంగాల్ వ్యాప్తంగా ఉన్న ఇమామ్ లకు రూ.2,500 గౌరవ వేతనం ప్రకటించారు. అనంతరం మసీదులో భక్తులను ప్రార్థనకు పిలిచే ముఅజ్జిన్ లకు కూడా ఇదే విధమైన ఆర్థిక సహాయాన్ని ఆమె విస్తరించారు. ఆ తర్వాత కాలంలో దీనిపై విమర్శలు రావడంతో 2020లో ఆలయాల్లో పనిచేసే అర్చకులకు సైతం గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయించారు. అయితే పురోహితులకు మెుదట రూ.1000 ఇవ్వగా.. దానిని 2026 ఎన్నికలకు ముందు రూ.2000కు మమతా పెంచారు.
మరోవైపు దీదీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతికి సంబంధించి సీఎం సువేందు అధికారి నేతృత్వంలోని ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తోంది. గత ప్రభుత్వంలో నిధుల పంపిణీలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక న్యాయ కమిషన్ ను ఏర్పాటు చేసింది. రిటైర్డ్ జస్టిస్ బిశ్వజిత్ దాస్ పర్యవేక్షణలో ఈ కమిషన్ పనిచేయనుంది.
మరోవైపు గత హయాంలో మహిళపై జరిగిన దాడులపై విచారణకు కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు సీఎం సువేందు అధికారి ప్రకటించారు. కేబినేట్ భేటి అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. ‘మేము రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ సమాప్తి ఛటర్జీ నాయకత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశాం. ఐపీఎస్ దమయంతి సేన్ ఇందులో కార్యదర్శిగా ఉంటారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు సంబంధించిన అన్ని కేసులపై కూడా విచారణ జరుపుతాం. ఒక నెలలో నివేదిక రావొచ్చు’ అని ఆయన పేర్కొన్నారు.

