AP

లోకేశ్ రష్యా టూర్‌కు ఏపీ ప్రభుత్వం అనుమతి..!

సెయింట్ పీటర్స్‌బర్గ్ అంతర్జాతీయ ఆర్థిక సదస్సులో పాల్గొననున్న లోకేశ్

జూన్ 3 నుంచి 6వ తేదీ వరకు రష్యాలో పర్యటన

కేంద్ర విదేశాంగ శాఖ అనుమతి తప్పనిసరి అని ఉత్తర్వుల్లో స్పష్టీకరణ

ఏపీ మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ రష్యాలో పర్యటించేందుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ వేదికగా జరిగే 29వ అంతర్జాతీయ ఆర్థిక సదస్సు (SPIEF 2026)లో పాల్గొనేందుకు ఈ అనుమతి ఇస్తున్నట్లు సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

 

వివరాల్లోకి వెళితే, ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆర్థిక సదస్సులలో ఒకటైన సెయింట్ పీటర్స్‌బర్గ్ అంతర్జాతీయ ఆర్థిక ఫోరం జూన్ 3 నుంచి 6వ తేదీ వరకు జరగనుంది. ఈ సదస్సులో పాల్గొనాల్సిందిగా మంత్రి లోకేశ్‌కు నిర్వాహక సంస్థ రోస్‌కాంగ్రెస్ ఫౌండేషన్ నుంచి అధికారిక ఆహ్వానం అందింది. ఈ విషయాన్ని ఏపీ ఆర్థిక అభివృద్ధి మండలి (APEDB) ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చి, పర్యటనకు అనుమతి కోరింది.

 

ఈ పర్యటనలో భాగంగా లోకేశ్ సెయింట్ పీటర్స్‌ బర్గ్ సదస్సులో పాల్గొనడంతో పాటు, మాస్కోలో కూడా పర్యటిస్తారు. అక్కడ రష్యా ఫెడరల్ మంత్రులు, ప్రభుత్వ రంగ సంస్థలు, వాణిజ్య సంఘాల ప్రతినిధులతో సమావేశమై ఆంధ్రప్రదేశ్-రష్యా మధ్య ఎనిమిది కీలక రంగాల్లో ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేసేందుకు చర్చిస్తారు.

 

అయితే, ఈ పర్యటనకు కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలో స్పష్టంగా పేర్కొంది. కేంద్ర విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి పొలిటికల్ క్లియరెన్స్ లభించిన తర్వాతే పర్యటన ఖరారవుతుంది. పర్యటనకు అయ్యే ఖర్చులను ఏపీఈడీబీ తన బడ్జెట్ నుంచి భరించనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో వెల్లడించింది.