మహానాడు సందర్భంగా టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు. ఎన్నికల్లో మహిళలు, యువతకు పార్టీలో అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు మనసులోని మాట బయటపెట్టారు. మహిళా సాధికారతపై కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ తరపున మహిళలకు 33 శాతం సీట్లు కేటాయిస్తామంటూ ప్రకటన చేశారు.
టీడీపీ మహానాడులో వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రకటన
చట్టసభల్లో మహిళల భాగస్వామ్యం పెరిగినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమన్నారు. ఆ విధంగా నమ్మిన పార్టీ టీడీపీ అని తేల్చిచెప్పారు. అందుకు కట్టుబడి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు పాసైనా, అవ్వకపోయినా 33 శాతం సీట్లు కేటాయిస్తామని తేల్చిచెప్పారు.
లోకేశ్ చేసిన ప్రకటనతో మహానాడు సభ ప్రాంగణంలో ఒక్కసారిగా మార్మోగిపోయింది. అంతకుముందు నుంచి లోకేశ్ చేయబోయే ప్రకటనపై ఉత్కంఠకు ఈ నిర్ణయంతో తెర పడింది. యువతకు, మహిళలకు పెద్దపీట వేయడం ద్వారా రాబోయే కాలంలో కొత్త నాయకత్వాన్ని తయారుచేస్తామని లోకేశ్ క్యాడర్‌కు దిశానిర్దేశం చేశారు.
ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయిస్తాం
రాష్ట్రానికి పెట్టుబడిదారులు వస్తున్నాయంటే అది అధినేత చంద్రబాబు కృషి వల్లేనని అన్నారు. సంక్షేమం-అభివృద్ధిపై చర్చకు తాను ఎప్పుడైనా సిద్దమేనంటూ ప్రత్యర్థులకు సవాల్ విసిరారు. వైసీపీ వేధింపులు తట్టుకోలేక నంద్యాలలో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుందని, ఎంతో మంది బీసీ, ఎస్టీ, మైనారిటీ సోదరులను చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
అక్కను వేధించవద్దన్న అమర్నాథ్గౌడ్ను కిరోసిన్ పోసి చంపేశారని గుర్తు చేశారు. దళిత డ్రైవర్ సుబ్రమణ్యాన్ని చంపేసి డోర్ డెలివరీ చేశారని, గొడ్డలి పార్టీ అంటే వైసీపీకి కోపం వచ్చిందన్నారు. మాది ఫైటర్ జెట్ అయితే మీది ఫ్యాక్షన్ అని, మాది కియా అయితే మీది కిడ్నాప్ అని విమర్శించారు వర్కింగ్ ప్రెసిడెంట్.

