హుస్నాబాద్ శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో మైనింగ్ ఇంజనీరింగ్ కోర్సు మంజూరుకు సీఎం కి విజ్ఞప్తి చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో బి.టెక్ మైనింగ్ ఇంజనీరింగ్ కోర్సును ప్రవేశపెట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రంలో, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో బొగ్గు తవ్వకాలు విస్తృతంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
ప్రభుత్వ విద్యాసంస్థల్లో..
దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా ప్రపంచస్థాయిలో కూడా అర్హత కలిగిన మైనింగ్ ఇంజనీర్లకు డిమాండ్ పెరుగుతోందని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వ విద్యాసంస్థల్లో బి.టెక్ (మైనింగ్ ఇంజనీరింగ్) కోర్సు అందుబాటులో చాలా పరిమితంగా ఉందని, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు ప్రైవేట్ కళాశాలల్లో ఉన్న అధిక ఫీజుల కారణంగా ఈ కోర్సును అభ్యసించలేకపోతున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
మైనింగ్ ఇంజనీరింగ్ కోర్సు..
హుస్నాబాద్ ప్రాంతం గనుల పరిశ్రమలకు సమీపంలో ఉండటంతో పాటు బొగ్గు గనుల ప్రాంతానికి అనుసంధానమై ఉండటం వల్ల, ఇక్కడ మైనింగ్ ఇంజనీరింగ్ కోర్సు ప్రారంభించడం విద్యార్థులకు మరియు పరిశ్రమలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. అందువల్ల హుస్నాబాద్ శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో బి.టెక్ (మైనింగ్ ఇంజనీరింగ్) కోర్సును తక్షణమే మంజూరు చేయడంతో పాటు అవసరమైన బోధన మరియు సాంకేతిక సిబ్బందిని కూడా నియమించాలని ముఖ్యమంత్రిని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.

