TELANGANA

తెలంగాణలో జూన్ 1 నుంచి 12 వరకు సర్కార్ ‘ప్రగతి’ ప్లాన్..?

రెండు వారాల పాటు సర్కార్ బిజీ బిజీ గా గడపనున్నది. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా జూన్ 1వ తేదీ నుండి జూన్ 12వ తేదీ వరకు స్పెషల్ ప్రోగ్రామ్స్ గా నిర్వహించాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకున్నది. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రోజుకో డిపార్ట్ మెంట్ నుంచి యాక్టివిటీస్ నిర్వహించనున్నారు. ఇందులో డెవలప్ మెంట్ ప్రోగ్రామ్స్ నుంచి కీలక నిర్ణయాలు వరకు ఉండనున్నాయి. ఈ స్పెషల్ ప్రోగ్రామ్ ను సక్సెస్ చేయాలని సీఎస్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు.

 

గృహ నిర్మాణం జూన్ 1..

 

కొత్త గృహాల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా సుమారు ఒక లక్ష ఇళ్లకు ఒకేసారి భారీ ఎత్తున గృహప్రవేశ మహోత్సవాలు నిర్వహించనున్నారు.ఇక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 2న అన్ని ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఘనంగా ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా విద్యాశాఖ ఆధ్వర్యంల సీఎం ఆదేశాల మేరకు 5 గురు ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించనున్నారు. జూన్ 3న వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం, కోహెడ గ్రామం (సర్వే నెం. 167/1) వద్ద అంతర్జాతీయ సమగ్ర పండ్ల మార్కెట్ నిర్మాణానికి మంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది.

 

జూలాజికల్ పార్క్‌లో సీసీ రోడ్డు ప్రారంభం

 

జూన్ 9 న వ్యవసాయ శాఖ మంత్రి కార్యాలయం ఆధ్వర్యంలో 1600 రైతు వేదికల ద్వారా పంటల వైవిధ్యీకరణ, ఎరువుల సమర్థవంతమైన వినియోగంపై రైతులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జూన్ 5 పురస్కరించుకుని జూన్ 1 నుండి 12 వరకు ప్రత్యేక పర్యావరణ వారోత్సవాలు జరగనున్నాయి.ఆర్మూర్‌లో ‘అరణ్య అర్బన్ పార్క్’,మెదక్‌లో ‘నగర్ వన్ యోజన అర్బన్ పార్క్’ (జూన్ 10) ప్రారంభించనునారు. కిన్నెరసాని వైల్డ్‌లైఫ్ శాంక్చువరీలో 3 సఫారీ వాహనాలు, పక్షుల ఎన్‌క్లోజర్, హనుమకొండలోని కాకతీయ జూలాజికల్ పార్క్‌లో సీసీ రోడ్డు ప్రారంభిస్తారు.

 

ప్రపంచ సైకిల్ దినోత్సవ ర్యాలీలు

 

అంతేగాక హనుమకొండలో కాలుష్య నియంత్రణ మండలి కొత్త కార్యాలయం, జోనల్ ల్యాబ్ కాంప్లెక్స్ ప్రారంభం మరియు డిజిటల్ గవర్నెన్స్ కోసం ‘ఐఎంఎస్’ ల్యాంచ్ చేయనున్నారు.ఇక జూన్ 3న ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా ర్యాలీలు, జూన్ 5న ‘వనమహోత్సవం’ ప్రతి జిల్లాలో 1 నుండి 2 హెక్టార్లలో సాంద్రత కలిగిన మిశ్రమ ప్లాంటేషన్, గ్రీన్ ప్లెడ్జ్ (హరిత ప్రతిజ్ఞ) తో పాటు రాష్ట్ర విశ్వవిద్యాలయాలలో వ్యర్థాల నిర్వహణపై సదస్సులు నిర్వహించనున్నారు.

 

గృహ శాఖ ,రహదారుల అభివృద్ధి జూన్ 6 ,8..

 

రోడ్డు భద్రత, ట్రాఫిక్ అవగాహన, మహిళలు,బాలల రక్షణ, డ్రగ్స్ నిరోధకాలపై అవగాహన కార్యక్రమాలు జరగనున్నాయి. బాలల రక్షణ కోసం గ్రామీణ స్థాయిలో ‘బాల పంచాయతీలు’ ఏర్పాటు చేయనున్నారు.రహదారులు భవనాల శాఖ జూన్ 8 న ఖమ్మం, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, నల్గొండ, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, సూర్యాపేట, వికారాబాద్ తదితర జిల్లాల్లో వందల కోట్ల వ్యయంతో నిర్మించిన పలు హై లెవెల్ బ్రిడ్జీలు, రహదారుల విస్తరణ పనుల ప్రారంభోత్సవాలు జరగనున్నాయి. వరంగల్, కరీంనగర్, ములుగు జిల్లాల్లో నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. వనపర్తి, మంచిర్యాల, మహబూబాబాద్, మరియు జనగామలలో ప్రభుత్వ వైద్య కళాశాలలు అందుబాటులోకి రానున్నాయి.

 

పురపాలక,గ్రామీణాభివృద్ధి రంగాలు జూన్ 7..

 

రూ.304 కోట్లతో మీర్ ఆలం ట్యాంక్ బ్రిడ్జ్, రూ.280 కోట్లతో ఉస్మాన్‌సాగర్ తాగునీటి ప్రాజెక్ట్, నార్సింగి వద్ద ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై బ్రిడ్జ్ రూ.229 కోట్లు ఎంఎంసీ ఆఫీస్ భవనం ప్రారంభించనున్నారు. అలాగే స్వచ్ఛ ఇవి ఆటోలు ప్రారంభం కానున్నాయి. పొదుపు సంఘాల మహిళల యాజమాన్యంలోని 553 ఆర్టీసీ బస్సులను జూన్ 5న ప్రారంభించనున్నారు. అలాగే మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోలార్ పవర్ ప్లాంట్ల ప్రారంభోత్సవం మరియు వడ్డీ లేని రుణాల విడుదల జరగనుంది.

 

ఇంధన, క్రీడా రంగాలు జూన్ 8,9..

 

‘ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్స్ 2025’ ప్రదానం చేయనున్నారు. 9 ఉమ్మడి జిల్లాల్లోని 18 సబ్‌స్టేషన్ల పరిధిలో 19 మెగావాట్ల గ్రౌండ్ మౌంటెడ్ సోలార్ పవర్ ప్లాంట్లకు శంకుస్థాపన చేయనున్నారు. మోడల్ సోలార్ విలేజెస్‌లో రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్స్ ల్యాంచ్ కానున్నాయి. క్రీడారంగంలో 6 స్పోర్ట్స్ అకాడమీల ప్రారంభోత్సవం మరియు జిల్లాల్లో 9 బహుళార్ధసాధక స్టేడియంల నిర్మాణానికి శంకుస్థాపన జరగనుంది. అంతర్జాతీయ, జాతీయ ఛాంపియన్‌షిప్‌లలో విజేతలకు నగదు ప్రోత్సాహకాలు పంపిణీ చేయనున్నారు.

 

మహిళా,శిశు సంక్షేమం ఆరోగ్య రంగాలు జూన్ 10 , 11..

 

మహిళా శిశు సంక్షేమం జూన్ 10 న హైదరాబాద్‌లో మొబైల్ అంగన్‌వాడీలు, క్రెచ్ కేంద్రాలు ప్రారంభం కానున్నాయి. అమీర్‌పేట్‌లోని చిన్నారులు, మహిళల హోమ్స్ కోసం రూ. 5 కోట్లతో మోడ్రన్ కామన్ కిచెన్‌కు శంకుస్థాపన చేయనున్నారు. టీజీ ఫుడ్స్‌లో రూ. 40 కోట్ల విలువైన ప్లాంట్‌ను ప్రారంభించనున్నారు. వైద్య ఆరోగ్య శాఖ జూన్ 11 న ఒకేసారి 572 మంది ఆరోగ్య సిబ్బందికి 300 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 272 మంది స్టాఫ్ నర్సులు నియామక ఉత్తర్వులు అందజేయనున్నారు. టిమ్స్ సనత్‌నగర్, పటాన్‌చెరు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, కొత్తగూడెం, మెదక్, నారాయణపేటలలో క్రిటికల్ కేర్ బ్లాకులు, కొల్లాపూర్ సీహెచ్‌సీ, భోంగీర్‌లో సెంట్రల్ మెడికల్ స్టోర్ ప్రారంభం కానున్నాయి. టిమ్స్ సనత్‌నగర్‌లో 100 సీట్ల సూపర్ స్పెషాలిటీ పీజీ హాస్టల్‌కు శంకుస్థాపన జరగనుంది.

 

విద్యాశాఖ ,మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ జూన్ 12..

 

జూన్ 12న రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో హైదరాబాద్ మరియు ఇతర జిల్లాల్లో విద్యార్థులకు ‘స్టూడెంట్ వెల్‌కమ్ కిట్స్’ పంపిణీ చేయనున్నారు.ఈ ప్రగతి ప్రణాళిక ముగింపు రోజైన జూన్ 12న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలు, కళాశాలలు,గ్రామీణ స్థాయి మహిళా సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు, ప్రజల భాగస్వామ్యంతో “మాదకద్రవ్యాల నిరోధక ఉమ్మడి ప్రతిజ్ఞ” కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు.రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతూ, పారదర్శకమైన పాలనను అందించడమే ధ్యేయంగా సాగనున్న ఈ 12 రోజుల కార్యాచరణను విజయవంతం చేయాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది.