తిరుమల కల్తీ నెయ్యి కేసు పేరెత్తగానే వైసీపీలో టెన్షన్ పెరుగుతోంది. తాజాగా ఈ కేసులోని ఈడీ ఎంటర్ కావడం కొత్త మలుపు తిరిగింది. బుధవారం ఏకంగా ఆరు రాష్ట్రాల్లోని 15 చోట్ల దాడులు చేసింది. దాదాపు రూ.60 లక్షలు సీజ్ చేసింది ఈడీ. దీని ద్వారా కొల్లగొట్టిన సొమ్మును రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారం మరొక మలుపు తిరిగింది.
తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు
తిరుమల కల్తీ నెయ్యి సరఫరా కేసు దర్యాప్తులో ఈడీ రంగంలోకి దిగేసింది. బుధవారం దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లోని 15 ప్రాంతాల్లో ఉదయం నుంచి రాత్రి వరకు ఏకకాలంలో సోదాలు చేసింది. మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరాఖండ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీల్లో ఈ దాడులు జరిగాయి.
మహారాష్ట్రలోని అహల్యానగర్, ముంబైలలో సోదాలు జరిగాయి. రాజస్థాన్‌లోని బికనీర్, ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్, రూర్కీ, తమిళనాడులోని దిండిగల్, ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు పలు ప్రాంతాలలో సోదాలు నిర్వహించింది. డెయిరీల యజమానులు, ప్రతినిధులు, హవాలా లావాదేవీల్లో పాల్గొన్న ఏజెంట్లు, నకిలీ రికార్డులు క్రియేట్ వ్యాపారుల ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు చేసింది ఈడీ.
రూ. 60 లక్షలు సీజ్.. నిందితులు రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు
అయితే స్థిరాస్తులకు సంబంధించిన కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నాయి. వారు కుటుంబసభ్యుల పేరిట చరాస్తులు కొనుగోలు చేసినట్టు ఈడీ గుర్తించింది. వాటి విలువ దాదాపు రూ. 45 కోట్ల రూపాయలుగా చెప్పుకొచ్చింది. టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన భోలేబాబా డెయిరీ ప్రతినిధులు, ఇతరులతో కలిసి భారీ ఎత్తున హవాలా లావాదేవీలు జరిపినట్లు నిర్ధారించింది.
డెహ్రాడూన్‌లో ఖరీదైన ప్రాంతాల్లో మూడు వాణిజ్య స్థలాలు కొన్నట్లు ఈడీ గుర్తించింది. వాటి విలువ దాదాపు రూ.7.80 కోట్లు. భోలేబాబా డైరెక్టర్ పొమిల్ జైన్ తన సంస్థ కంపెనీ నుంచి రూ.1.18 కోట్లు మళ్లించుకుని భారీ భవనం కొనుగోలు చేసినట్టు తేలసింది. మరికొన్ని స్థిరాస్తులు కొన్నట్లు తేలడంతో వాటిపై ఈడీ ఆరా తీస్తోంది. ఈడీ దాడుల విషయం తెలియగానే వైసీపీలో చిన్నపాటి టెన్షన్ మొదలైంది. తమవైపు ఈడీ చూస్తుందేమోనన్న భయం వారిని వెంటాడుతోంది.

