భారత చరిత్రలో అత్యధిక కాలం ప్రధానిగా కొనసాగిన నేతగా జవహర్‌లాల్ నెహ్రూ రికార్డును అధిగమించిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎన్‌డీయే కూటమి సమావేశంలో కీలక ప్రసంగం చేశారు. ఈ ఘనత తన వ్యక్తిగత విజయమేమీ కాదని, ఎన్‌డీయే కుటుంబం సాధించిన ఉమ్మడి విజయమని పేర్కొన్నారు. అదే సమయంలో కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ, 2014 తర్వాత దేశంలో చోటుచేసుకున్న మార్పులను ప్రస్తావించారు. ఆయన ప్రసంగంలోని కీలక అంశాలు..
• నెహ్రూ రికార్డును అధిగమించడం తన జీవితంలో ప్రత్యేక ఘట్టమని మోదీ అన్నారు. ఇంతకాలం ఎన్నికైన ప్రధానిగా ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.
• ఈ విజయాన్ని తన వ్యక్తిగత విజయంగా చూడడం లేదన్నారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు, కార్యకర్తలు, కోట్లాది ప్రజల సహకారంతోనే ఈ ప్రయాణం సాధ్యమైందని పేర్కొన్నారు.
• దేశ ప్రజల రాజకీయ పరిణతి వల్లే స్థిర ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయని చెప్పారు. 2014కు ముందు దేశం అస్థిరత, అనిశ్చితి కారణంగా నష్టపోయిందని వ్యాఖ్యానించారు.
• కాంగ్రెస్ దేశాన్ని అవినీతి, విధానపరమైన వైఫల్యాలు, నిరాశలోకి నెట్టిందని ఆరోపించారు. అభివృద్ధి నెమ్మదిగా సాగడాన్ని ‘హిందూ గ్రోత్ రేట్’గా పిలవడం తప్పని, దాన్ని ‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’గా పిలవాలని అన్నారు.
• గత 12 ఏళ్లలో 25 కోట్ల మందికిపైగా పేదరికం నుంచి బయటపడ్డారని చెప్పారు. ఇది ప్రభుత్వ విధానాలు సరైన దిశలో ఉన్నాయనే విషయాన్ని నిరూపిస్తోందన్నారు.
• వికసిత భారత్ లక్ష్యం ఇప్పుడు కేవలం ప్రభుత్వ లక్ష్యం కాదన్నారు. దేశ ప్రజలందరి కలగా, సంకల్పంగా అది మారిందని పేర్కొన్నారు.
• మౌలిక వసతుల అభివృద్ధిలో భారీ పురోగతి సాధించినట్లు వివరించారు. 2014లో 74 విమానాశ్రయాలు ఉండగా ఆ సంఖ్య ఇప్పుడు 160కి చేరిందని చెప్పారు.
• ఎక్స్‌ప్రెస్‌వేలు, మెట్రో సేవలు, రక్షణ ఎగుమతులు, డిజిటల్ లావాదేవీల్లో దేశం గణనీయ పురోగతి సాధించిందని మోదీ పేర్కొన్నారు.
• మొబైల్ ఫోన్ తయారీ, సౌర విద్యుత్ ఉత్పత్తి, సెమీకండక్టర్ రంగాల్లో భారత్ ప్రపంచ స్థాయిలో ముందుకు వెళ్తోందని తెలిపారు.
• యువత, మహిళలు, రైతులు, మధ్యతరగతి ప్రజల ఆశయాలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. అభివృద్ధి పరుగులో ఎవరూ వెనుకబడొద్దనే ఉద్దేశంతో పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని వివరించారు.

