AP

విద్యుత్ చార్జీలపై కీలక ప్రకటన చేసిన ఏపీ మంత్రి గొట్టిపాటి..

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తీవ్రంగా దెబ్బతిన్న విద్యుత్ రంగాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం విజయవంతంగా పునరుద్ధరించిందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… జగన్ ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థలో సృష్టించిన విధ్వంసాన్ని కేవలం రెండేళ్లలోనే సరిదిద్ది, పట్టాలెక్కించామని పేర్కొన్నారు.

 

గత రెండేళ్లలో విద్యుత్ ఛార్జీలను ఒక్క రూపాయి కూడా పెంచలేదని… రాబోయే మూడేళ్లలో కూడా విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ఆయన స్పష్టమైన హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం వినియోగదారులపై అదనపు భారం మోపిన ‘ట్రూ అప్’ విధానానికి స్వస్తి పలికి, చరిత్రలోనే మొదటిసారిగా ‘ట్రూ డౌన్’ విధానాన్ని తీసుకువచ్చామని తెలిపారు. దీని ద్వారా యూనిట్‌కు 13 పైసల చొప్పున ఛార్జీలను తగ్గించి, ప్రజలకు రూ. 4,498 కోట్ల మేర ఉపశమనం కలిగించామని వెల్లడించారు.

 

గత వైసీపీ ప్రభుత్వం తన ఐదేళ్ల కాలంలో ఏకంగా తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచి ప్రజలపై మోయలేని భారం మోపిందని మంత్రి ధ్వజమెత్తారు. సూర్యఘర్ పథకం కింద ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు 6 లక్షల ఉచిత సోలార్ కనెక్షన్లను అందించడానికి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పాదనను గణనీయంగా పెంచడం ద్వారా, బయటి రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసే ఖరీదైన విద్యుత్ భారాన్ని తగ్గించామన్నారు. పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా 160 గిగావాట్ల విద్యుత్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

 

ఆర్‌డీఎస్‌ఎస్ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాలలో విద్యుత్ మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నామని, విద్యుత్ నష్టాలను తగ్గించేందుకు పెద్ద సంఖ్యలో కొత్త సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌మిషన్ లైన్లను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వివరించారు.