National

కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేపై దాడి..!

యువతలో ఆన్‌లైన్‌లో సంచలనంగా మారిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేపై దాడి జరిగింది. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో సోమవారం ఓ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఆయనపై కొందరు వ్యక్తులు మూకుమ్మడిగా దాడి చేశారు. ఒక్కసారిగా చెంపపై కొట్టడంతో దీప్కే ఆత్మరక్షణ కోసం ప్రయత్నించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర కలకలం రేగింది.

 

నీట్ పేపర్ లీక్, దేశంలో నిరుద్యోగం, విద్యా వ్యవస్థలోని లోపాలపై సీజేపీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జైపూర్‌లోని షహీద్ స్మారక్ వద్ద సోమవారం ఆందోళన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమం జరుగుతుండగానే అభిజీత్ దీప్కేపై ఈ దాడి జరిగింది. ఆందోళన చేస్తున్న అభిజీత్‌ను ఓ గుంపు అడ్డుకుని దాడికి పాల్పడింది. దాంతో, అభిజీత్‌ పై దాడికి పాల్పడిన వారిని పట్టుకుని కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు చితకబాదారు.

 

కొందరు యువతను ‘బొద్దింకలు’ అంటూ సీజేఐ చేసిన ఓ వివాదాస్పద వ్యాఖ్యకు వ్యంగ్యాస్త్రంగా, అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీలో చదువుతున్న 30 ఏళ్ల అభిజీత్ దీప్కే మే నెలలో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ని ప్రారంభించారు. అనతికాలంలోనే ఈ ఉద్యమం యువతను ఆకట్టుకుని ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. గతంలో ఢిల్లీ, పుణె నగరాల్లో నిరసనలు చేపట్టిన ఈ బృందం, జైపూర్‌లోనూ ఆందోళనకు పిలుపునిచ్చింది. అయితే, క్షేత్రస్థాయిలో నిరసన తెలుపుతుండగా ఆయనపై దాడి జరగడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.