National

కేంద్రం ‘ఆపరేషన్‌ సిందూర్‌ 2.0’ చేపట్టనుందా..?

‘ఆపరేషన్‌ సిందూర్‌ 2.0’ పేరుతో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఓ లేఖపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. రక్షణ శాఖ కార్యదర్శి రాజేశ్‌ కుమార్‌ సింగ్‌ జారీ చేసినట్లు ప్రచారంలో ఉన్న ఆ పత్రం పూర్తిగా నకిలీదేనని తేల్చిచెప్పింది. ఆ లేఖకు కేంద్ర రక్షణ శాఖతో గానీ, ప్రభుత్వంతో గానీ ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది.

 

పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ విభాగం ఈ మేరకు సోషల్‌ మీడియా వేదిక ‘ఎక్స్‌’లో ప్రకటన విడుదల చేసింది. ‘ఆపరేషన్‌ సిందూర్‌ 2.0: ప్రధాని ఆదేశాలు.. వ్యూహాత్మక లక్ష్యం’ అనే శీర్షికతో ఓ లేఖ ఆన్‌లైన్‌లో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చినట్లు తెలిపింది. ఆ పత్రంలో ఉన్న సమాచారం మొత్తం కల్పితమని స్పష్టం చేసింది.

 

రక్షణ శాఖ కార్యదర్శి పేరును ఉపయోగించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని పీఐబీ పేర్కొంది. అలాంటి లేఖను రక్షణ శాఖ కార్యదర్శి గానీ, రక్షణ మంత్రిత్వ శాఖ గానీ ఎప్పుడూ జారీ చేయలేదని వెల్లడించింది. సోషల్‌ మీడియాలో కనిపించే ప్రతి సమాచారాన్ని నిజమని నమ్మొద్దని ప్రజలను హెచ్చరించింది.

 

అధికారిక ప్రకటనలు, ప్రభుత్వ వర్గాల నుంచి వచ్చే సమాచారాన్నే విశ్వసించాలని సూచించింది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అనుమానాస్పద పోస్టులు, ఫొటోలు, వీడియోలు కనిపిస్తే వాటిని పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ విభాగానికి పంపాలని కోరింది. నిర్ధారణ లేకుండా అలాంటి సమాచారాన్ని ఫార్వర్డ్‌ చేయడం మరింత గందరగోళానికి దారితీస్తుందని పేర్కొంది.

 

ఇటీవల వైరల్‌ అవుతున్న మరో ప్రచారాన్నీ పీఐబీ ఖండించింది. కేంద్ర మంత్రులు కిరణ్‌ రిజిజు, అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌ న్యాయమూర్తులతో కలిసి లండన్‌ పర్యటనకు వెళ్లారని సోషల్‌ మీడియాలో పోస్టులు వైరల్‌ అయ్యాయి. అయితే ఆ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని పీఐబీ స్పష్టం చేసింది.

 

వైరల్‌ అవుతున్న ఫొటోలు కూడా లండన్‌లో తీసినవి కావని పీఐబీ వెల్లడించింది. అవి 2025 నవంబరులో ఢిల్లీలోని త్యాగరాజ్‌ స్టేడియంలో నిర్వహించిన ఆల్‌ ఇండియా జడ్జెస్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ సందర్భంగా తీసిన చిత్రాలని వివరించింది. తప్పుడు ప్రచారాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది.