TELANGANA

తెలంగాణలో త్వరలో కమలం వికసిస్తుంది: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్..

తెలంగాణలో త్వరలోనే భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధికారంలోకి వస్తుందని, రాష్ట్రంలో కమలం వికసించడం ఖాయమని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ధీమా వ్యక్తం చేశారు. నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకునేందుకు క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు మరింత పట్టుదలతో శ్రమించాలని ఆయన పిలుపునిచ్చారు.

 

ఆదివారం హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఆయన శంషాబాద్‌లో రంగారెడ్డి రూరల్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. దీనితో పాటు మరో తొమ్మిది జిల్లాల కార్యాలయాలను వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో పశ్చిమ బెంగాల్‌లో పార్టీ కనబరిచిన పోరాట పటిమను తెలంగాణలోనూ పునరావృతం చేయాలని సూచించారు.

 

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి, అరాచక పాలన సాగిస్తోందని నితిన్ నబిన్ ఆరోపించారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు కార్యకర్తలు వీధుల్లోకి వచ్చి పోరాడాలని పిలుపునిచ్చారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించడంలో బీజేపీ కీలక పాత్ర పోషించగా, ఆ ఫలితాన్ని కాంగ్రెస్ తనకనుకూలంగా మార్చుకుని లబ్ధి పొందిందని ఆయన వ్యాఖ్యానించారు.

 

బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతి గల్లీ, మొహల్లాకు పార్టీ సిద్ధాంతాలను, ప్రధాని నరేంద్ర మోదీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను తీసుకెళ్లాలని ఆయన దిశానిర్దేశం చేశారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ‘డబుల్ ఇంజిన్’ సర్కారు ఉంటేనే తెలంగాణ సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

 

అంతకుముందు, శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న నితిన్ నబిన్‌కు కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్, రాష్ట్ర బీజేపీ నేత ఎన్. రాంచందర్ రావు తదితరులు ఘన స్వాగతం పలికారు. అనంతరం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన బూత్ అధ్యక్షుల ‘విజయ్ సంకల్ప్ సమ్మేళనం’లో ఆయన పాల్గొని ప్రసంగించారు.