TELANGANA

పాలనపై చర్చకు సిద్ధం.. తేదీ చెప్పండి: రేవంత్‌ రెడ్డికి కేటీఆర్ సవాల్..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన సవాల్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వీకరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రస్తుత పాలన, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని ఆయన ప్రకటించారు. ఈ చర్చకు సంబంధించిన తేదీ, సమయాన్ని ఖరారు చేయాలని ఆయన ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

 

ఇటీవల రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమంలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన గడువులో సగం కాలం పూర్తయినా, చెప్పుకోవడానికి ఒక్క విజయం కూడా లేదని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో వరి సాగు 2014-15 నాటికి ఉన్న 26 లక్షల హెక్టార్ల నుంచి, పాలన ముగిసే సమయానికి 59 లక్షల హెక్టార్లకు పెరిగిందని గుర్తు చేశారు. కాళేశ్వరం వంటి ప్రాజెక్టులు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయని ఆయన ఈ సందర్భంగా వివరించారు.

 

ప్రస్తుత ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి గత ప్రభుత్వంపై నిందలు వేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. తాము అధికారం నుంచి దిగిపోయే నాటికి రాష్ట్ర అప్పు రూ. 3.5 లక్షల కోట్లు మాత్రమేనని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంత దారుణంగా ఉంటే ముఖ్యమంత్రి 72 సార్లు ఢిల్లీ పర్యటనలు ఎందుకు చేశారని ఆయన ప్రశ్నించారు.

 

అసెంబ్లీ, ప్రెస్ క్లబ్ లేదా జూబ్లీహిల్స్ ప్యాలెస్.. వేదిక ఏదైనా చర్చకు తాను వస్తానని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ చర్చకు రేవంత్ రెడ్డి లేదా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వచ్చినా తనకు అభ్యంతరం లేదన్నారు. “ప్రభుత్వ వైఫల్యాలను ఆధారాలతో సహా నిరూపించడంలో నేను విఫలమైతే, రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటాను” అని కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు.