ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. రాష్ట్ర ఆర్థిక ప్రగతి, పెట్టుబడుల ఆకర్షణ, అమరావతి నిర్మాణం, సంక్షేమ పథకాల అమలు, సోషల్ మీడియా నియంత్రణ వంటి అనేక అంశాలపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించింది. సమావేశం అనంతరం మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వివరాలు వెల్లడించారు. సోషల్ మీడియా దుర్వినియోగాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న ప్రభుత్వం, దానిని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోబోతోందని ఆయన స్పష్టం చేశారు.
సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం
సమాజానికి సోషల్ మీడియా దుర్వినియోగం ఒక రోగంలా పరిణమించిందని, దాని వల్ల మేలు కంటే కీడే ఎక్కువగా జరుగుతోందని కేబినెట్ అభిప్రాయపడింది. వ్యక్తిత్వ హననం, ప్రభుత్వాలపై అబద్ధపు ప్రచారం, మహిళలను కించపరచడం వంటివి శ్రుతిమించుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో అనైతిక కార్యకలాపాలను ఏమాత్రం ఉపేక్షించకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని మంత్రి పార్థసారథి తెలిపారు. దీని కోసం కొన్ని కీలక చర్యలను కేబినెట్ ఆమోదించిందని వివరించారు.
రాష్ట్ర స్థాయిలో ఒక ‘సోషల్ మీడియా రెస్పాన్స్ సెల్’ ఏర్పాటు.
దుర్వినియోగం, విద్వేష ప్రచారాలను అరికట్టేందుకు ‘రాష్ట్ర స్థాయి టాస్క్‌ఫోర్స్’ ఏర్పాటు.
విద్వేషాలు వ్యాప్తి చేసే హ్యాండిల్స్‌ను గుర్తించడానికి ఆధునిక ఫారెన్సిక్ టూల్స్ కొనుగోలుకు నిధులు.
సోషల్ మీడియా కేసుల దర్యాప్తుపై ఎస్‌హెచ్‌ఓలకు ప్రత్యేక శిక్షణ, సైబర్ పరిజ్ఞానం ఉన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ల (పీపీల) నియామకం.
ఇతర దేశాల్లోని చట్టాలను అధ్యయనం చేసి, అవసరమైతే ప్రత్యేక చట్టం తీసుకురావడంపై పరిశీలన.
భారీ పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్
రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహాన్ని పెంచే లక్ష్యంతో స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్ (SIPB) ఆమోదించిన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తం 13 ప్రాజెక్టులకు సంబంధించి రూ.31,431 కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటి ద్వారా రాష్ట్రంలో 31,431 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
తిరుపతి జిల్లా శ్రీసిటీలో మాండెలెజ్ ఇండియా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.1801 కోట్లతో ఏర్పాటు చేయనున్న చాక్లెట్ తయారీ యూనిట్ వీటన్నింటిలో ముఖ్యమైనది. ఈ యూనిట్ ద్వారా దేశంలోనే కోకో వినియోగించి చాక్లెట్లు తయారు చేయడంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానానికి చేరుకుంటుందని మంత్రి వివరించారు. అలాగే వేస్ట్ ఆయిల్స్‌ను ఏవియేషన్ ఫ్యూయల్‌గా మార్చేందుకు ఎస్ఏఎఫ్ఎఫ్ ఇండియా ఏర్పాటు చేయనున్న పరిశ్రమకు కూడా ఆమోదం తెలిపారు.
అమరావతిపై కీలక నిర్ణయాలు
అమరావతికి సంబంధించి కేబినెట్ పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. రాజధానిలో భూములు ఇచ్చిన రైతులకు ఊరట కల్పిస్తూ వార్షిక కౌలును పెంచింది. జూన్ 12, 2024 తర్వాత ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద భూములు ఇచ్చిన రైతులకు ఈ పెంపు వర్తిస్తుంది. మెట్ట భూములకు ఎకరాకు రూ.30,000 నుంచి రూ.40,000కు, జరీబు భూములకు రూ.50,000 నుంచి రూ.60,000కు వార్షిక కౌలును పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. వీరికి 10 సంవత్సరాల పాటు ఈ కౌలు చెల్లిస్తారు.
అలాగే, గ్రామ కంఠాల్లో ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు ఇచ్చే నెలవారీ పరిహారాన్ని రూ.5,000 నుంచి రూ.10,000కు పెంచుతూ 12 నెలల పాటు అందించాలని తీర్మానించారు. వీటితో పాటు, అమరావతిలో నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డు, ఈషా ఫౌండేషన్, ఆర్ట్ ఆఫ్ లివింగ్, సీఐఐ గ్లోబల్ లీడర్‌షిప్ సెంటర్ వంటి సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం తెలిపారు. ముఖ్యంగా, నేషనల్ ఫిషరీస్ బోర్డు ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్థాయిలో అక్వేరియం, ఆర్నమెంటల్ ఫిష్ బ్రీడింగ్ సెంటర్ ఏర్పాటు కానుంది.
విద్యారంగానికి పెద్దపీట
సామాజికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో ప్రభుత్వం కీలక అడుగు వేసింది. సాంఘిక సంక్షేమ గురుకులాల్లో చదివే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఐఐటీ-జేఈఈ, నీట్ వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు అత్యుత్తమ శిక్షణ ఇచ్చేందుకు మూడు “సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్” ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటిని విశాఖపట్నం, నెల్లూరు, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో ఏర్పాటు చేస్తారు. కార్పొరేట్ సంస్థలకు దీటుగా నాణ్యమైన శిక్షణ ఇచ్చి, పేద విద్యార్థులను ఐఐటీలు, ఐఐఎంలలో సీట్లు సాధించేలా తీర్చిదిద్దడమే లక్ష్యమని మంత్రి పార్థసారథి తెలిపారు.
టూరిజం ప్రోత్సాహానికి కొత్త పాలసీ
ఆంధ్రప్రదేశ్‌ను ఒక ప్రధాన పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం నూతన విధానాన్ని ప్రకటించింది. రాష్ట్రంలో సంగీత కచేరీలు (Concerts), కార్నివాల్స్ వంటి భారీ ఈవెంట్లను నిర్వహించే వారికి ‘వయబిలిటీ గ్యాప్ ఫండింగ్’ కింద ఆర్థిక సహాయం అందించనుంది. 20,000 మంది లోపు హాజరైతే రూ.2 కోట్లు, 20,000 నుంచి 50,000 మధ్య హాజరైతే రూ.5 కోట్లు, 50,000 దాటితే రూ.5 కోట్ల వరకు ప్రభుత్వం ఆర్థిక చేయూతనిస్తుంది. దీనికి తోడు, ప్రభుత్వ ఆధీనంలోని పెద్ద మైదానాలను ఉచితంగా వాడుకునేందుకు కూడా అవకాశం కల్పిస్తుంది.
సాగునీటి ప్రాజెక్టులు, జల సంరక్షణ
సాగు, తాగునీటి ప్రాజెక్టులపై కేబినెట్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. పెద్దగడ్డ రిజర్వాయర్ ప్రాజెక్టు పనులకు సంబంధించి ఐదుసార్లు టెండర్లు విఫలమైన నేపథ్యంలో, 14.88 శాతం ఎక్కువకు కోట్ చేసిన టెండర్‌ను ఆమోదించింది. కుప్పం బ్రాంచ్ కెనాల్ నుంచి చెరువులకు నీటిని అందించే పనులకు రూ.67.98 కోట్లకు పరిపాలన ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ‘జలధార’ కార్యక్రమం పురోగతిని సమీక్షించాలని, ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తాగునీరు, పశుగ్రాసంపై ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించినట్లు మంత్రి వెల్లడించారు.
భూ సమస్యల పరిష్కారానికి చర్యలు
దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న రెవెన్యూ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించింది. గుంటూరు జిల్లా పుల్లడిగుంట గ్రామంలో దశాబ్దాలుగా నివసిస్తున్న 200 కుటుంబాలకు ఊరట కల్పిస్తూ, వారు నివసిస్తున్న 10.16 ఎకరాల ‘తోపు పోరంబోకు’ భూమిని పట్టా భూమిగా మార్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ఇలాంటి భూ వర్గీకరణ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వేలాది కుటుంబాలకు న్యాయం చేస్తామని, మార్చి 2027 నాటికి పరిష్కరించగల అన్ని రెవెన్యూ సమస్యలను పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారని మంత్రి పేర్కొన్నారు.
మరికొన్ని ముఖ్యమైన ఆమోదాలు
అనంతపురం, మంగళగిరి, రాయదుర్గంలో టీడీపీ కార్యాలయాల నిర్మాణానికి భూమి కేటాయింపు.
విశాఖపట్నంలో ఎన్ఐఏ కేసుల విచారణ కోసం ప్రత్యేక కోర్టు ఏర్పాటు.
రైతుల నుంచి వరి ధాన్యం సేకరణ, ఖరీఫ్ విత్తనాల కోసం ఎన్‌సిడిసి నుంచి రూ.1800 కోట్ల రుణం సమీకరణ.
తిరుపతి సమీపంలో ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ పార్క్ ఏర్పాటుకు భూ కేటాయింపు.
హైకోర్టులో ఒక రిజిస్ట్రార్ పోస్టు మంజూరు.

