తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఒక కీలకమైన లేఖ రాశారు. సమాజంలో చిన్నారులపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టడం, వారి భద్రతను కాపాడటం మనందరి ప్రాథమిక బాధ్యత అని ఆయన ఈ లేఖలో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న బాలల లైంగిక వేధింపుల ఉదంతాల నేపథ్యంలో, చట్టాలను మరింత పటిష్ఠంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని పవన్ కల్యాణ్ బలంగా ఆకాంక్షించారు.
విచారణలో వేగం.. నిర్ధిష్ట కాలపరిమితి
చిన్నారులపై జరిగే దాడులకు సంబంధించిన కేసుల్లో న్యాయం జరగడంలో ఆలస్యం కాకూడదని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. పోక్సో (POCSO) కేసులకు పోలీసులు, న్యాయవ్యవస్థ అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ తరహా కేసుల విచారణ కేవలం మాటలకే పరిమితం కాకుండా.. ఒక నిర్ధిష్ట కాలపరిమితిలోగా పూర్తి కావాలని స్పష్టం చేశారు. అప్పుడే నేరస్థుల్లో భయం పుడుతుందని, బాధితులకు సత్వర న్యాయం అందుతుందని లేఖలో పేర్కొన్నారు.
తక్షణ కేసు నమోదు..
సాధారణంగా ఏదైనా ఘటన జరిగినప్పుడు ప్రాథమిక విచారణ పేరుతో సమయం వృధా అవుతుంటుంది. అయితే, పోక్సో ఘటనల్లో ఎలాంటి ప్రాథమిక విచారణ లేకుండానే, ఫిర్యాదు అందిన వెంటనే తక్షణమే కేసు నమోదు చేయాలని డిప్యూటీ సీఎం సూచించారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 39 ప్రకారం చిన్నారులకు ఉన్న జీవించే హక్కును, వారి బాల్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
నిందితులకు నో బెయిల్
ఇలాంటి దారుణమైన నేరాలకు పాల్పడే నిందితుల పట్ల కఠినంగా వ్యవహరించాలని పవన్ కల్యాణ్ కోరారు. కోర్టుల్లో నిందితులకు బెయిల్ రాకుండా ప్రభుత్వ యంత్రాంగం గట్టిగా వ్యతిరేకించాలని, వారికి కఠిన శిక్షలు పడేలా చూడాలని స్పష్టం చేశారు. అదే సమయంలో, భయానక పరిస్థితులను ఎదుర్కొన్న బాధితులకు సమాజంలో పటిష్టమైన రక్షణ కల్పించడంతో పాటు, వారికి మానసిక ధైర్యాన్ని అందించడం ఎంతో ముఖ్యమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు.

