AP

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు..!

ఆంధ్రప్రదేశ్‌లో కలకలం రేపుతున్న కరోనా కేసుల గురించి కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. పరీక్షల్లో ఒమిక్రాన్‌ ఆర్‌ఎఫ్‌-5 వేరియంట్‌ బయటపడింది. ప్రపంచ వ్యాప్తంగా గుర్తించిన కేసుల్లో ఒమిక్రాన్‌ సబ్ వేరియంట్‌లో ఆర్‌ఎఫ్‌-5 ఒకటి. ఈ వేరియంట్‌ కేసులు ఆగ్నేయాసియాలోని కొన్ని దేశాల్లో ఎక్కువగా నమోదు అవుతున్నాయి.

 

ఏపీలో కరోనా కేసుల కలకలం-ఏపీలో కరోనా కేసుల గురించి కొత్త సమాచారం బయటకు వచ్చింది. కడప జిల్లాకు చెందిన నాలుగు కేసులు నమోదైన పేషెంట్ల నుంచి నమూనాలను తీసి పూణెలో వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు. దీనికి సంబంధించి రిపోర్టు రావడంతో కొత్త విషయాలు బయటపడ్డాయి. కరోనా పాజిటివ్ నమూనాల జన్యు శ్రేణి క్రమ విశ్లేషణ ద్వారా ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌ని గుర్తించారు వైద్యులు.

 

కొత్త రకం వేరియంట్ గుర్తింపు- RF.5 అనేది కరోనా వైరస్‌లోని ఒమిక్రాన్ వేరియంట్‌కు చెందిన ఒక సబ్-లైనేజ్. ప్రపంచవ్యాప్తంగా గుర్తించిన ఒమిక్రాన్ వేరియంట్లలో ఇది కూడా ఒకటి. ఒకే చోట కాకుండా వేర్వేరు ప్రాంతాల్లో ఆయా వేరియంట్లు బయటపడ్డాయి. ఆర్‌ఎఫ్‌.5 కేసులు ఎక్కువగా ఆగ్నేయాసియా దేశాల్లోని సింగపూర్‌ వంటి దేశాల్లో నమోదవుతున్నాయి.

 

ఆగ్నేయాసియా దేశాల్లో ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌-కొత్త వేరియంట్ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు అధికారులు. ఆర్‌ఎఫ్‌-5 లక్షణాలు ఇతర ఒమిక్రాన్‌ వేరియంట్ల మాదిరిగా ఉంటాయని చెబుతున్నారు. గొంతు నొప్పి, దగ్గు, జ్వరం, తలనొప్పి, ముక్కు కారడం, అలసట, ఒళ్లంతా నొప్పులు ఉంటాయని చెప్పారు.

 

అధికారులతో మంత్రి సత్యకుమార్ సమీక్ష-రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండడంతో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ అధికారులతో సమీక్ష చేపట్టారు. కరోనా కేసుల గురించి ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఒమిక్రాన్‌ ఆర్‌ఎఫ్‌.5 వేరియంట్‌‌ను డబ్ల్యూహెచ్‌వో నిశితంగా పరిశీలిస్తోందన్నారు డీఎంఈ విష్ణువర్థన్‌.

 

ఇతర ఒమిక్రాన్‌ వేరియంట్లతో పోలిస్తే ఇది ప్రమాదకరం కాదన్నారు. పరీక్షలకు అవసరమైన కిట్లు, మౌలిక వసతుల్ని సమకూరుస్తున్నట్లు చెప్పారు. ఏపీలో ఇప్పటి వరకు 16 కరోనా కేసులు నమోదు అయ్యాయి. తాజాగా మరో రెండు కేసులు నమోదయ్యాయి. వాటిలో నెల్లూరు జిల్లా, ఎన్టీఆర్‌ జిల్లాలో బయటపడ్డాయి.

 

నెల్లూరు జిల్లాకు చెందిన బాలుడికి క్యాన్సర్‌ ఉండడంతో జూలై 13న చికిత్స కోసం కుటుంబసభ్యులు పుదుచ్చేరికి తీసుకెళ్లారు. బాలుడికి కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్‌ వచ్చింది. ఈ సమాచారం తెలియగానే నెల్లూరు జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు బాలుడితో పాటు తల్లిదండ్రులు, బంధవులకు పరీక్షలు చేశారు. వారందరికీ నెగిటివ్ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు.

 

ఎన్టీఆర్‌ జిల్లాకు చెందిన 13 ఏళ్ల బాలికకు కిడ్నీ సమస్యతో సతమతమవుతోంది. విజయవాడ జీజీహెచ్‌లో డయాలసిస్‌ చేస్తున్న సమయంలో జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు తీవ్రమయ్యాయి. డాక్టర్లు ఆర్టీపీసీఆర్‌ పరీక్ష చేయడంతో పాజిటివ్‌ వచ్చింది. వెంటనే ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. కుటుంబ సభ్యులకు చేసిన పరీక్షల్లో నెగిటివ్‌ వచ్చింది.