AP

ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలల్లో వీటిని అమలు చేయనున్నారు. రాష్ట్రంలో జూన్ 30న జారీ చేసిన GO MS No.396 ద్వారా RSKల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

 

ఫ్రంట్ ఆఫీస్ సేవలు..

రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నది ప్రజా సేవల మెరుగుదల కోసమే అని అన్నారు. రిజిస్ట్రేషన్ శాఖను ప్రైవేటీకరించే ఉద్దేశం లేదని కూటమి ప్రభుత్వం తేల్చిచెప్పింది. పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల తరహాలోనే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు పని చేస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. కేవలం ఫ్రంట్ ఆఫీస్ సేవలు మాత్రమే PPP భాగస్వామి ద్వారా నిర్వహణ చేస్తామని క్లారిటీ ఇచ్చారు. రిజిస్ట్రేషన్ చట్టబద్ధ అధికారాలు ప్రభుత్వ అధికారులకు ఉంటాయని తెలిపారు. రిజిస్టేషన్ పత్రాల తుది పరిశీలన, రిజిస్ట్రేషన్ ఆమోదం సబ్-రిజిస్ట్రార్లదేనని తెలిపారు.

సేవా కేంద్రాల లక్ష్యం..

డిజిటల్ సంతకాలు, రిజిస్ట్రేషన్, పత్రాల విడుదలపై ప్రభుత్వ అధికారులదే పూర్తి అధికారం ఉంటుదరి స్పష్టం చేశారు. ప్రభుత్వ డేటా, రికార్డులపై ప్రైవేట్ భాగస్వామికి ఎలాంటి హక్కులు ఉండవని ప్రభుత్వం తేల్చి చెప్పింది. Anywhere Registration, Advance Slot Booking, PDE సేవలు అందుబాటులోకి తెస్తామని అధికారులు తెలిపారు. ఆధునిక వెయిటింగ్ హాల్స్, డిజిటల్ చెల్లింపులు, క్యూ మేనేజ్‌మెంట్‌తో మెరుగైన సేవలతో పాటు, ప్రజల సమయం, ఖర్చు ఆదా చేయడమే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల లక్ష్యం అని ప్రభుత్వం తెలిపింది. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలపై వస్తున్న అపోహలను నమ్మొద్దని కూటమి సర్కార్ స్పష్టం చేసింది.