TELANGANA

హైకోర్టు సంచలన నిర్ణయం.. హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ తొలగింపునకు ఆదేశాలు..

హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ వ్యవహారశైలిపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వరుసగా కోర్టు ధిక్కరణ పిటిషన్లు నమోదవుతున్న నేపథ్యంలో ఆయన్ను కమిషనర్‌ పదవి నుంచి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆయన స్థానంలో ఐజీ స్థాయి అధికారిని నియమించాలని చీఫ్‌ సెక్రటరీకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం సహించబోమని ధర్మాసనం స్పష్టం చేసింది.

 

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా లోతుకుంట పరిధిలోని సర్వే నంబర్‌ 1, 2లలో ఉన్న 40 ఎకరాల భూమికి సంబంధించిన వ్యవహారం విచారణకు వచ్చిన సందర్భంగా రంగనాథ్‌ అఫిడవిట్‌ దాఖలు చేశారు. ఆ భూమిలోకి హైడ్రా సిబ్బంది ప్రవేశించలేదని, ఎలాంటి కూల్చివేతలు చేపట్టలేదని అందులో పేర్కొన్నారు. వాస్తవాలను వక్రీకరించి పిటిషనర్‌ కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. కోర్టులు, న్యాయవ్యవస్థపై తమకు అత్యున్నత గౌరవం ఉందని పేర్కొంటూ జరిగిన పరిణామాలకు బేషరతుగా క్షమాపణలు కోరారు.

 

అయితే రంగనాథ్‌ వివరణతో సంతృప్తి చెందని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. రంగనాథ్‌పై ఇప్పటికే దాదాపు 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలయ్యాయని గుర్తు చేసింది. ఒకే అధికారిపై ఇన్ని కోర్టు ధిక్కరణ కేసులు ఎందుకు నమోదవుతున్నాయని ప్రశ్నించింది. కోర్టు మధ్యంతర ఉత్తర్వులను పాటించకుండా వ్యవహరించడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందా అని ప్రభుత్వ న్యాయవాదిని నిలదీసింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే తీరును ఉపేక్షించలేమని స్పష్టం చేసింది.

 

హైకోర్టు తాజా ఆదేశాలు హైడ్రా వ్యవహారంలో కీలక పరిణామంగా మారాయి. కమిషనర్‌ మార్పుతో పాటు ఐజీ స్థాయి అధికారిని నియమించాలని ఇచ్చిన ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.