AP

ఏపీలో స్థానిక ఎన్నికల నగారా..! ఎప్పుడంటే..?

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు హంగామా మొదలవుతోంది. ఓ వైపు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం జరుగుతోంది. మరోవైపు పార్టీలు నేతలు, కేడర్‌ను అలర్ట్ చేయడంతో రానున్న రెండు లేదా మూడు నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని సచివాలయం వర్గాలు చెబుతున్నాయి.

 

ఏపీలో స్థానిక సంస్థల హంగామా- తొలుత సెప్టెంబర్ నుంచి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం ఆలోచన చేసింది. అయితే ఏపీ వ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం జరుగుతోంది. ఇటీవల ఎన్నికల సంఘం గడువు కూడా పెంచింది. జూలై 31 నాటికి ముసాయిదా జాబితా విడుదల కానుంది. ఓటర్ల ముసాయిదా జాబితాపై అభ్యంతరాలను ఆగస్టు 30లోగా సమర్పించవచ్చు. సెప్టెంబరు 28 వరకు ఆయా ఓటర్లకు నోటీసులు జారీ చేస్తారు. అక్టోబరు మూడున ఓటర్ల తుది జాబితా బయటకు రానుంది.

 

అక్టోబర్ సెకండ్ వీక్ నుంచి ఎన్నికలు-అక్టోబర్ సెకండ్ వీక్ నుంచి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని కూటమి సర్కార్ అడుగులు వేస్తోంది. తొలుత మున్సిపల్, ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీల ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది. ఇందుకోసం ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. మొదట సెప్టెంబర్‌లో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని ఆలోచన చేసింది. ఓటర్ల జాబితా సిద్ధం కాకుండా వెళ్లడం కరెక్టు కాదని భావించి వెనక్కి తగ్గినట్టు సచివాలయం వర్గాలు చెబుతున్నాయి.

 

ప్రజల్లోకి రాజకీయ పార్టీలు-అక్టోబర్ తొలివారంలో ఓటర్ల జాబితాను విడుదల చేయనుంది ఎన్నికల సంఘం. సెకండ్ వీక్‌లో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది. నవంబర్ ఫస్ట్ వీక్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నిలకు ప్లాన్ చేస్తోంది. పంచాయతీ ఎన్నికల నవంబర్ మూడు లేదా నాలుగో వారంలో నిర్వహించనుంది. ఓటర్ల జాబితా తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని కూటమి సర్కార్ డిసైడ్ అయ్యింది. ఈ నేపథ్యంలో నేతలు, కార్యకర్తలతో పార్టీల అధినేత సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు.

 

నేతలతో సీఎం చంద్రబాబు- ఆదివారం సీఎం చంద్రబాబు కీలక నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జూలై 27 నుంచి 45 రోజులపాటు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలని ఆదేశించారు. రెండేళ్లులో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా వివరించాలన్నారు. యువత భవితకు, వాళ్ల ఆలోచనలకు కూటమి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత, పెట్టుబడుల రాకతో ఉద్యోగాల కల్పన, చదువుల గురించి ప్రస్తావించనున్నారు.

 

ఓ వైపు పవన్.. మరోవైపు నాదెండ్ల-అటు జనసేన పార్టీ కూడా అదే జోరు కొనసాగిస్తోంది. భుజానికి ఆపరేషన్ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ యాక్టివ్ అవుతున్నారు. మరోవైపు శుక్రవారం కార్యకర్తలతో అన్ని నియోజకవర్గాల నేతలు సమావేశం విజయవాడలో జరిగింది. ప్రతీ ఒక్కరూ పవన్ కోసం పని చేయాలని కార్యకర్తలకు మంత్రి నాదెండ్ల పిలుపు ఇచ్చారు.

 

కార్యకర్తలు, నేతలతో జగన్ వరుస భేటీలు-మరోవైపు బీజేపీ కూడా వేగంగా అడుగులు వేస్తోంది. నియోజకవర్గాల నేతలతో అధ్యక్షుడు మాధవ్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేయాలని ఆలోచన చేస్తున్నారు. మరోవైపు వైసీపీ అధినేత జగన్ కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ అయ్యారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సమావేశాలు చేస్తున్నారు. కాకపోతే కేసుల వల్ల కొందరు నేతలు హాజరుకావడం లేదని తెలుస్తోంది. గతంలో మాదిరిగా ఈసారి 90 శాతం తామే గెలవాలన్న పట్టుదలతో వైసీపీ అడుగులు వేస్తోంది.