AP

ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ పకడ్బందీగా ఉండాలి: మంత్రి నారా లోకేశ్..

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో ఎలాంటి న్యాయపరమైన, సాంకేతిక సమస్యలు తలెత్తకుండా పకడ్బందీగా నోటిఫికేషన్లు విడుదల చేయాలని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అధికారులను స్పష్టంగా ఆదేశించారు. జాబ్ కేలండర్-2026 అమలుపై ఆయన అధ్యక్షతన ఏర్పాటైన మంత్రుల బృందం బుధవారం ఉండవల్లిలోని ఆయన నివాసంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించింది. ఈ సమావేశానికి పలువురు మంత్రులు ఆన్‌లైన్ ద్వారా హాజరు కాగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా కీలక అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులు, వాటి భర్తీకి అనుసరించాల్సిన విధివిధానాలపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రుల బృందానికి వివరించారు.

 

జాబ్ కేలండర్-2026లో భాగంగా ప్రకటించిన 10,060 ఉద్యోగాలను మొత్తం నాలుగు దశల్లో భర్తీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా తొలి దశలో వివిధ విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 1,523 అధ్యాపక పోస్టుల భర్తీకి ఈ ఏడాది మే 15నే నోటిఫికేషన్ జారీ చేసిన విషయాన్ని అధికారులు గుర్తు చేశారు. రెండో దశ కింద 3,168 పోస్టులకు వాస్తవానికి ఆగష్టు 15న నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంది.

 

అయితే, రాష్ట్రపతి ఉత్తర్వుల అమలులో ఎదురైన కొన్ని సాంకేతిక ఇబ్బందులు, ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిన వినతుల నేపథ్యంలో ఈ ప్రక్రియలో స్వల్ప జాప్యం జరిగింది. ఈ కారణాలను పరిగణనలోకి తీసుకున్న మంత్రుల బృందం, రెండో దశ నోటిఫికేషన్‌ను సెప్టెంబర్ 15న విడుదల చేయాలని నిర్ణయించింది.

 

3, 4 దశల నోటిఫికేషన్లు అక్టోబర్‌లో

 

జాబ్ కేలండర్‌ను వేగంగా పూర్తి చేసేందుకు వీలుగా మూడు, నాలుగు దశల ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ను ఒకేసారి అక్టోబర్ 15న విడుదల చేయాలని మంత్రి లోకేశ్ అధికారులను ఆదేశించారు. మూడో దశలో 2,388 పోస్టులు, నాలుగో దశలో 2,981 పోస్టులు భర్తీ చేయనున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆయా శాఖల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఖాళీలను భర్తీ చేయాలని, ఆ దిశగా అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. రెండో దశలో భర్తీ చేయనున్న 3,168 పోస్టుల్లో అత్యధికంగా 2,225 పోస్టులు హోంశాఖ పరిధిలోనే ఉన్నాయని అధికారులు తెలిపారు. గ్రూప్-1లో ప్రస్తుతం గుర్తించిన పోస్టుల సంఖ్యను మరింత పెంచాల్సిన అవసరం ఉందని మంత్రుల బృందం ఈ సందర్భంగా అభిప్రాయపడింది.

 

మొత్తం 10,060 పోస్టుల భర్తీ ప్రక్రియలో ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా, సకాలంలో పూర్తి చేసి, ప్రతి ఏటా జాబ్ కేలండర్ విడుదల చేసే సంప్రదాయాన్ని కొనసాగించాలని లోకేశ్ దిశానిర్దేశం చేశారు. జాబ్ కేలండర్-2026కు సంబంధించిన పూర్తిస్థాయి ఖాళీల వివరాలను ఈ నెల 6న జరగనున్న కేబినెట్ సమావేశం ముందు ఉంచనున్నట్లు తెలిపారు. ఈ సమీక్షలో మంత్రులు వంగలపూడి అనిత, పి. నారాయణ, కొండపల్లి శ్రీనివాస్, కందుల దుర్గేష్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్, జీఏడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి షంషేర్‌ సింగ్‌ రావత్‌, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఛైర్మన్ రాజీవ్ కుమార్ మీనా, ఆర్థికశాఖ కార్యదర్శి వినయ్ చంద్, ఏపీపీఎస్సీ కార్యదర్శి రవి సుభాష్ పాల్గొన్నారు.