మియాపూర్: మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు ఛేదించారు. కొరియర్ బాయ్‌గా నటిస్తూ ఇంట్లోకి ప్రవేశించి, ఒంటరిగా ఉన్న మహిళపై పెప్పర్ స్ప్రే చేసి బంగారు మంగళసూత్రాన్ని అపహరించిన నిందితుడిని బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయుర్వేద మందుల కొరియర్ డెలివరీ పేరుతో ఇంట్లోకి ప్రవేశించిన నిందితుడు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన షేక్ ఖాజా అర్షాల్ (20) ఈ నేరానికి పాల్పడ్డాడు. జూలై 31న మియాపూర్‌కు చెందిన బి. ఆదినారాయణ ఇంటికి కొరియర్ డెలివరీ నెపంతో వెళ్లాడు. ఇంట్లో మహిళ ఒక్కరే ఉన్నట్లు గుర్తించిన అనంతరం ఆమె ముఖంపై పెప్పర్ స్ప్రే చల్లి, మెడలో ఉన్న దాదాపు 4 తులాల బంగారు మంగళసూత్రాన్ని తెంచుకుని అక్కడి నుంచి పరారయ్యాడు.
ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మియాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్, ఇతర ఆధారాల ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కొరియర్ డెలివరీ పేరుతో ఇంట్లోకి ప్రవేశించి చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

