AP

ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా గొంతు నొక్కుతున్నారు..! నాణేనికి మరో వైపు చూపిస్తా..! జగన్ షాకింగ్ కామెంట్స్..

ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా తమ గొంతు నొక్కేందుకే చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆరోపించారు. శాసనసభను దాదాపు రెండేళ్లుగా బహిష్కరిస్తున్నప్పటికీ, శాసనమండలి వేదికగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని ఆయన పార్టీ ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు.

ఆగస్టు 17 నుంచి ప్రారంభం కానున్న శాసనసభ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో బుధవారం నాడు ఆయన పార్టీ శాసనసభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాన పార్టీ అయిన వైసీపీకి ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేందుకు ప్రభుత్వం ఇష్టపడటం లేదని, అందుకే ప్రజా సమస్యలను మీడియా ద్వారానే ప్రజల దృష్టికి తీసుకెళ్లి నాణేనికి మరోవైపు చూపిస్తానని స్పష్టం చేశారు.

శాసనమండలిలో వైసీపీకి ఉన్న బలాన్ని ఉపయోగించుకుని ప్రజావాణిని బలంగా వినిపించాలని జగన్ సూచించారు. “గత 74 రోజులుగా డీఎస్సీ కుంభకోణంపై 10 రకాల నిరసనలు చేపట్టాం. పేపర్ లీకేజీ, ఔట్‌సోర్సింగ్ కుంభకోణాలు, స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు, ప్రభుత్వ ఉత్తర్వుల మార్పు వంటి అంశాలను ఆధారాలతో సహా బయటపెట్టాం. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రమేయంపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశాం” అని జగన్ వివరించారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన పథకాలకు సంబంధించి 13 త్రైమాసికాల బకాయిలు పేరుకుపోయాయని, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జగన్ అన్నారు. సుమారు రూ. 9,100 కోట్లు, రూ. 3,300 కోట్ల బకాయిలు ఉండగా, ప్రభుత్వం కేవలం రూ. 2,900 కోట్లు విడుదల చేసిందని విమర్శించారు. ఈ అంశాన్ని మండలిలో లేవనెత్తి చర్చకు పట్టుబట్టాలని ఎమ్మెల్సీలకు సూచించారు.

రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదని, పంటలకు నీరందడం లేదని, ఉచిత పంటల బీమా నిలిపివేయడంతో అన్నదాతలు తీవ్ర సంక్షోభంలో ఉన్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. పీపీపీ ప్రాజెక్టుల పేరుతో ప్రైవేటు సంస్థలకు రాయితీలు కల్పిస్తూ ప్రజలపై భారం మోపుతున్నారని, ప్రభుత్వ సేవల ప్రైవేటీకరణను గట్టిగా ప్రశ్నించాలని పిలుపునిచ్చారు.

దిశ చట్టం రద్దు, ప్రభుత్వ విధానాలను ప్రశ్నించిన బీసీ నేతలు చింతడ రవి, ముస్తఫాలపై అక్రమ కేసులు బనాయించడం వంటి అంశాలను సభలో ప్రస్తావించాలని ఆయన ఆదేశించారు. జూనియర్ డాక్టర్ల సమ్మె, ఉద్యోగులు, మహిళలు, యువతలో ఉన్న అసంతృప్తిని కూడా మండలిలో ఎత్తిచూపాలని, పూర్తి ఆధారాలతో సభకు వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని జగన్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.