National

భారత్‌తో సరిహద్దు వివాదం..! చేతులెత్తేసిన నేపాల్..

భారత్‌తో దశాబ్దాలుగా కొనసాగుతున్న సరిహద్దు వివాదం నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఇరు దేశాల మధ్య సరిహద్దులను ఖరారు చేసిన 1816 నాటి చారిత్రక సుగౌలీ ఒప్పందానికి సంబంధించిన అసలు పత్రాలు తమ వద్ద ఉన్నాయో లేదో స్పష్టంగా తెలియదని నేపాల్ ప్రభుత్వం పార్లమెంటుకు వెల్లడించింది. లిపులేఖ్, కాలాపానీ, లింపియాధురా ప్రాంతాలపై భారత్‌తో వివాదం కొనసాగుతున్న తరుణంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.

నేపాల్ విదేశాంగ మంత్రి షిశిర్ ఖనాల్ ఈ విషయాన్ని ప్రతినిధుల సభలో స్వయంగా వెల్లడించారు. కొన్ని ఒప్పందాలకు సంబంధించిన రికార్డులు నేషనల్ ఆర్కైవ్స్‌లో ఉన్నప్పటికీ, అవి అసలైన ఒప్పంద పత్రాలా కాదా అనే విషయంపై స్పష్టత లేదని ఆయన పేర్కొన్నారు. సుగౌలీ ఒప్పందంతో పాటు, 1950 నాటి శాంతి, స్నేహ ఒప్పంద పత్రాలు కూడా తమ వద్ద ఉన్నట్టు కొన్ని రికార్డుల ద్వారా తెలుస్తోందని.. అయితే, పార్లమెంటరీ కమిటీ ఆర్కైవ్స్, మ్యూజియంలు, వివిధ మంత్రిత్వ శాఖలలో శోధించినప్పటికీ, ఈ రెండు కీలక ఒప్పందాల అసలు ప్రతులు లభ్యం కాలేదని వివరించారు.

1814-16 మధ్య జరిగిన ఆంగ్లో-నేపాల్ యుద్ధం అనంతరం సుగౌలీ ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం, కాళీ (మహాకాళి) నదిని నేపాల్ పశ్చిమ సరిహద్దుగా నిర్ణయించారు. అయితే, ఆ నది లింపియాధురా వద్ద ఉద్భవిస్తుందని, కాబట్టి కాలాపానీ, లిపులేఖ్ ప్రాంతాలు తమవేనని నేపాల్ వాదిస్తోంది. దీనికి భిన్నంగా, లిపులేఖ్ సమీపంలోని నీటి బుగ్గల నుంచి నది ప్రారంభమవుతుందని, చారిత్రక పరిపాలనా రికార్డుల ప్రకారం ఈ ప్రాంతాలు ఉత్తరాఖండ్‌లో భాగమని భారత్ స్పష్టం చేస్తోంది. 2020లో ఈ మూడు ప్రాంతాలను కలుపుతూ నేపాల్ తన నూతన రాజకీయ పటాన్ని విడుదల చేయగా, భారత్ దానిని తీవ్రంగా తోసిపుచ్చింది.

ఇటీవల లిపులేఖ్ మీదుగా వాణిజ్యాన్ని పునఃప్రారంభించేందుకు భారత్, చైనాలు అంగీకరించడంపై నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో అసలు ఒప్పంద పత్రాలపై స్పష్టత లేకపోవడం, అంతర్జాతీయ వేదికలపై తమ వాదనలను బలంగా వినిపించే విషయంలో నేపాల్‌ను బలహీనపరిచే అంశంగా మారింది