TELANGANA

తెలంగాణ రాజకీయాలపై మరోసారి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి హాట్ కామెంట్స్..

తెలంగాణ రాజకీయాలపై మరోసారి హాట్ కామెంట్స్ చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి. తెలంగాణ రాజకీయాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని కుండబద్దలు కొట్టేశారు. నిజాయితీగా పని చేసే నాయకులు మద్దతుగా నిలిస్తే.. తమిళనాడు మాదిరిగా మార్చేస్తామని అన్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారికి కాకుండా వలస వచ్చినవారికి పదవులు లభిస్తున్నాయని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తెలియని వారు ఉండరు. ఎవరు ఏమనుకున్నా ఏ మాత్రం పట్టించుకోరు. మీడియా ముందు ఏం చెప్పాలో అదే చెప్పేస్తారు. సొంత పార్టీపైనా, ప్రత్యర్థులపై ఆయన తనదైన శైలిలో విరుచుకుపడతారు. ఈ విషయంలో అస్సలు తగ్గరు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో కళాకారుడు ఏపూరి సోమన్న రెండున్నర దశాబ్దాల పాటల ప్రస్థానంపై ఆయన పుస్తకాన్ని ఆవిష్కరించారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. తెలంగాణ రాజకీయాలు-గత ప్రభుత్వ పాలన-ప్రస్తుత పరిస్థితులపై నోరు విప్పారు.

తెలంగాణ రాజకీయాలను తమిళనాడు మాదిరిగా మార్చేస్తామన్నారని అన్నారని, ఎక్కడ వచ్చిందని సూటిగా ప్రశ్నించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని లక్షల కోట్లు దోచుకుంటునోళ్ల వెంట పడతామని అన్నారని ఎక్కడంటూ ప్రశ్నలు లేవనెత్తారు. మేము నిజాయితీ పరులమని జెప్పి మా సహనాన్ని, ఓపికను, చేతగాని తనంగా భావించవద్దన్నారు. అవసరం వచ్చినప్పడు విద్యార్ధులు, నిరుద్యోగులు, రైతులు, పేదలు, అవినీతికి వ్యతిరేకంగా యుద్దం చేస్తామన్నారు.  ఈ విషయంలో ఎవరికీ భయపడేది లేదని తేల్చేశారు.

తెలంగాణ ఉద్యమంలో ఉన్నవాళ్లు, నిజాయితీపరులు, యువకులు శాసనసభలో అడుగు పెట్టాలన్నారు. తెలంగాణ ఉద్యమం, కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేనివారు, ఆంధ్ర నాయకుల మోచేతి నీళ్లు తాగేవారు ప్రభుత్వంలో కీలక పదవులు అనుభవించడం బాధాకరమన్నారు. దోపిడీకి, అవినీతి వ్యతిరేకంగా యుద్దం చేస్తామన్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అదే సమయంలో బీఆర్‌ఎస్ పార్టీని ఆయన ఏకిపారేశారు. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడానని, అందుకే తనను టార్గెట్ చేశారని చెప్పుకొచ్చారు. కేసీఆర్‌ను గద్దె దింపుతామని, ఆయన కుటుంబాన్ని జైలుకు పంపిస్తామని ఆనాడు చెప్పినట్టే జరిగిందన్నారు.

అసెంబ్లీలో కాలేశ్వరం ప్రాజెక్ట్ గట్టిగా మాట్లాడానని, లక్షల కోట్ల అప్పు గురించి ప్రస్తావించానని తెలిపారు. నువ్వేమైనా నియంతవా? తెలంగాణ అంటే నీ రాజ్యమనుకుంటున్నావా? నువ్వు రాజువనుకుంటున్నవా? నువ్వు రాజైతే, నీ కొడుకు యువరాజు అంటే ఆనాడు నేను తట్టుకోలేదన్నారు. 60 ఏళ్ల ఉద్యమలో ఎంతో మంది త్యాగాలు చేస్తే నాలాంటి వారు పార్లమెంట్‌లో కొట్లాడితే సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని గుర్తు చేశారు. అందుకే నేను పోరాటం చేస్తానన్నారు. మునుగోడు దెబ్బకు కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో పడుకున్నారని తనదైనశైలిలో చెప్పుకొచ్చారు.