TELANGANA

టీజీపీఎస్సీ కీలక ప్రకటన.. వచ్చే వారం నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ల జాతర..!

తెలంగాణలోని నిరుద్యోగ యువతకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేస్తూ వచ్చే వారం నుంచి వివిధ శాఖల్లోని ఖాళీల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ప్రకటించింది. మరోవైపు ప్రభుత్వ శాఖల్లో ఏర్పడే ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేసేందుకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి పోటీ పరీక్షలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ రెండు కీలక ప్రకటనలతో ఉద్యోగార్థుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.

నిన్న‌ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా టీజీపీఎస్సీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఛైర్మన్‌ బుర్రా వెంకటేశం మాట్లాడారు. నియామక ప్రక్రియలో పారదర్శకత, జవాబుదారీతనానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. చిన్న పొరపాటు జరిగినా వేలాది మంది అభ్యర్థుల భవిష్యత్తుపై ప్రభావం పడుతుందని, అందుకే ప్రతి దశలోనూ అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తామని తెలిపారు. ప్రశ్నాపత్రాల రూపకల్పన నుంచి మూల్యాంకనం వరకు అన్ని ప్రక్రియల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి, పొరపాట్లకు తావులేని వ్యవస్థను రూపొందిస్తున్నట్లు వివరించారు.

ఇదే సమయంలో సంగారెడ్డిలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే సుమారు 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని గుర్తుచేశారు. ఇటీవల మరో 10 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చామన్నారు. ప్రభుత్వ శాఖల్లో ఏర్పడే ఖాళీలను గుర్తించి, ప్రతీ ఆరు నెలలకు ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు నిర్వహించేలా పటిష్టమైన విధానాన్ని తీసుకొస్తామని ప్రకటించారు. ఉద్యోగాల భర్తీ బాధ్యత ప్రభుత్వానిదేనని, నిరుద్యోగ యువత ఎలాంటి వదంతులను నమ్మకుండా పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. టీజీపీఎస్సీ, ప్రభుత్వం నుంచి వచ్చిన ఈ స్పష్టమైన హామీలతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతలో ఉత్సాహం నెలకొంది.