National

కేంద్రంపై సీజేపీ ఆగ్రహం..! సెప్టెంబర్ 5న మరోసారి భారీ నిరసనకు పిలుపు..!

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరోసారి ఆందోళన బాట పట్టాలని నిర్ణయించింది. కేంద్రం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ, సెప్టెంబర్ 5న ఢిల్లీలో శాంతియుత నిరసన ప్రదర్శన నిర్వహించనున్నట్లు ప్రకటించింది. నీట్ పరీక్షల నేపథ్యంలో మరణించిన విద్యార్థుల కుటుంబాలు, పోలీసుల వేధింపులకు గురైన బాధితులతో కలిసి ఈ ర్యాలీ చేపట్టనున్నట్లు వెల్లడించింది.

ఈ నిరసన ర్యాలీ సెప్టెంబర్ 5న ఇండియా గేట్ నుండి ఢిల్లీలోని నూతన పోలీస్ హెడ్‌ క్వార్టర్స్ వరకు కొనసాగనుంది. జూలై 25న ప్రభుత్వం ఇచ్చిన హామీలను పరిగణనలోకి తీసుకుని తాము దేశవ్యాప్త నిరసనలను విరమించుకున్నామని, అయితే ఇప్పుడు ప్రభుత్వం మాట తప్పిందని సీజేపీ ఆరోపించింది. ఇది యువతను, బాధితుల కుటుంబాలను వంచించడమేనని పార్టీ తన ప్రకటనలో పేర్కొంది. తమ సహనాన్ని బలహీనతగా భావించవద్దని, ప్రభుత్వ వైఖరి కారణంగానే తాము మళ్లీ రోడ్డెక్కాల్సి వస్తోందని హెచ్చరించింది.

ఆగస్టు 18న సుప్రీంకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వలేదని సీజేపీ గుర్తుచేసింది. దేశవ్యాప్తంగా నమోదైన ఎఫ్‌ఐఆర్‌ల జాబితాను అందిస్తే, వాటిని రద్దు చేసే అంశాన్ని పరిశీలిస్తామని కోర్టు పేర్కొన్నప్పటికీ, ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాలేదని తెలిపింది. ఇప్పటికీ ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి లిఖితపూర్వక హామీ అందలేదని వివరించింది. ఈ నిరసన కార్యక్రమంలో విద్యార్థులు, యువత, సామాన్య ప్రజలు శాంతియుతంగా, పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సీజేపీ విజ్ఞప్తి చేసింది. “ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి” అనేదే తమ ప్రధాన డిమాండ్ అని ఈ సందర్భంగా స్పష్టం చేసింది.