TELANGANA

గ్లోబల్ హబ్‌గా హైదరాబాద్‌.. ఎన్విడియా వెరా రూబిన్‌ జీపీయూలతో భారీ ప్రాజెక్ట్..!

హైదరాబాద్‌కు మరో మణిహారంగా నిలవనుంది ఏఐ ఫ్యాక్టరీ. ఆసియాలో మొదటి అత్యంత అత్యాధునిక ఎన్విడియా వెరా రూబిన్ ఏఐ క్లస్టర్‌ను ఏఎం ఇంటెలిజెన్స్ ఏర్పాటు చేయనుంది. దాదాపు 8 బిలియన్ డాలర్ల పెట్టుబడితో తొలి దశలో 200 మెగావాట్ల సామర్థ్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆ కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు.

ఫార్మాలోనే కాదు ఐటీ రంగంలోనూ హైదరాబాద్ నగరం దూసుకుపోతోంది. తాజాగా చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఆసియా ఖండంలో తొలిసారి అత్యాధునిక ఎన్విడియా వెరా రూబిన్ క్లస్టర్లలో ఒక దాన్ని హైదరాబాద్ సిటీలో ఏర్పాటు చేయనుంది. అందుకు ఏఎం ఇంటెలిజెన్స్ సంస్థ సన్నాహాలు చేస్తోంది.

ఇంధన సంస్థ గ్రీన్‌కో ప్రమోటర్లు స్థాపించిన ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్లాట్‌ఫామ్. ఎనర్జీ-ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మేళనంతో ప్రపంచంలో అగ్రగామి ఇంటెలిజెన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థగా ఎదగాలని భావిస్తోంది. ఈ ప్రాజెక్టుతో భారత్ అత్యంత శక్తివంతమైన ఏఐ కంప్యూట్ సామర్థ్యాన్ని సొంతం చేసుకోనున్న దేశంగా అవతరించనుంది.

ఆసియాలో ఫస్ట్ ఏఐ ఫ్యాక్టరీ

హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న మొట్టమొదటి ఏఐ ఫ్యాక్టరీలో ఏకంగా 9 వేల ఎన్విడియా రూబిన్ జీపీయూలను ఉపయోగించనుంది ఏఎంఐ. దీనికి సంబంధించి ఏఎంఐ ఇప్పటికే కొనుగోలు ఒప్పందాన్ని ఖరారు చేసింది. 30 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యంతో పని చేసే ప్రాజెక్టు వచ్చే ఏడాది అంటే 2027 తొలి త్రైమాసికానికి పూర్తవుతుందని సదరు కంపెనీ ప్రకటన చేసింది. ఈ సంస్థ కేవలం భారత్‌కే పరిమితం కాలేదు.

అమెరికా, ఫిన్లాండ్, మలేషియా దేశాల్లో ఏఐ మౌలిక వసతులను విస్తరించాలని భారీ ప్లాన్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఒక గిగావాట్ కంప్యూట్-యాజ్-ఎ-సర్వీస్ సామర్థ్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్నది ప్రధాన లక్ష్యంగా చెబుతున్నారు ప్రతినిధులు. ఈ క్రమంలో హైదరాబాద్ కేంద్రాన్ని తొలి దశ ప్రాజెక్టుగా చేపడుతోంది.

ఎన్విడియా వెరా రూబిన్‌తో కలిసి భారీ ప్రాజెక్ట్!

భవిష్యత్తులో దాదాపు 8 బిలియన్ డాలర్ల వ్యయంతో 200 మెగావాట్ల కంప్యూటింగ్ సామర్థ్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. ఈ ప్రాజెక్టు గురించి ఏఎంఐ ఛైర్మన్ అనిల్ చలమలశెట్టి కీలక విషయాలు వెల్లడించారు. పవర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ద్వారా నేరుగా ఏఐ టోకెన్లను సృష్టించే సాంకేతికత సామర్థ్యాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తోందన్నారు.

ఆ తర్వాత ఎన్విడియా వెరా రూబిన్‌ను తొలిసారి భారత్‌కు తీసుకురావడం మరొక మైలురాయిగా వర్ణించారు. రెండు దశాబ్దాలకు మా సంస్థ ఎలక్ట్రాన్‌లను విలువగా మార్చడంపై దృష్టి సారించినట్టు తెలిపారు. ఎన్విడియా వెరా రూబిన్ ఆర్కిటెక్చర్‌ను అనుసంధానించడం వల్ల వేగంగా డేటా బదిలీ కానుంది. అధునాతన నిల్వ వ్యవస్థలపై దృష్టి సారిస్తోంది.

ట్రిలియన్-పారామీటర్ నమూనాలు, తదుపరి తరం ఏజెంటిక్ ఏఐ అప్లికేషన్‌లతో సహా ప్రపంచంలోని అతిపెద్ద అత్యంత అధునాతన ఏఐ నమూనాలలో కొన్నింటిని అమలు చేయడానికి హైదరాబాద్ ఏఐ ఫ్యాక్టరీని రూపొందిస్తోంది.  భారత్, అమెరికా, యూరప్ దేశాల్లో 5 గిగావాట్ల సామర్థ్యంతో విద్యుత్ ఆధారిత ఏఐ డేటా సెంటర్లను అభివృద్ధి చేసే పనిలో పడింది ఏఎంఐ సంస్థ.

అందుకోసం అత్యాధునిక ఏఐ చిప్‌లకు అవసరమయ్యే విద్యుత్, అవి విడుదల చేసే ఉష్ణోగ్రతలను అదుపులో ఉంచేందుకు అత్యంత అధునాతనమైన లిక్విడ్ కూలింగ్ సాంకేతికతను ఉపయోగిస్తోంది. హై-డెన్సిటీ ఏఐ కంప్యూటింగ్ కోసం ఆ కేంద్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ కేంద్రం.. హైపర్‌ స్కేలర్లు, సావరిన్ ఏఐ ప్రాజెక్టులు, రీసెర్చ్ ల్యాబ్‌లు, వంటి సేవలను అందిస్తూ ఏఏఐని అత్యంత చవకగా ప్రజలకు అందచేయడానికి కీలక పాత్ర పోషించనుంది.