AP

అమరావతిలోని వీఐటీ-ఏపీ, ఆక్టేవ్ మధ్య కీలక ఒప్పందం..!

అమరావతిలోని వీఐటీ-ఏపీ విశ్వవిద్యాలయం, ప్రముఖ సాంకేతిక సంస్థ ‘ఆక్టేవ్’ మధ్య రెండేళ్ల కాలపరిమితితో ఒక కీలక అవగాహన ఒప్పందం కుదిరింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ వంటి వేగంగా ఎదుగుతున్న ఆధునిక సాంకేతిక రంగాల్లో విద్యార్థులకు పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా ఆచరణాత్మక శిక్షణను అందించడమే ఈ భాగస్వామ్య ఒప్పందం ముఖ్య ఉద్దేశం.

ఈ ఒప్పందంలో భాగంగా ఆక్టేవ్ సంస్థకు చెందిన నిపుణులైన మెంటార్లతో కలిసి విద్యార్థులు ప్రత్యక్షంగా ప్రాజెక్టులను రూపొందించనున్నారు. ప్రతి ప్రాజెక్టులోనూ ఒక ప్రొఫెసర్‌తో పాటు నలుగురు విద్యార్థులు, ఇద్దరు మెంటార్లు భాగస్వాములుగా ఉంటూ, మూడు నెలల నిర్ణీత వ్యవధిలో ప్రాజెక్టును పూర్తి చేసేలా ప్రణాళికను సిద్ధం చేశారు. దీనివల్ల విద్యార్థులకు రియల్-టైమ్ అనుభవం నేరుగా లభించనుంది.

అంతేకాకుండా, మార్కెట్ అవసరాలకు తగినట్లుగా వీఐటీ-ఏపీలో AI, ML పాఠ్యాంశాల రూపకల్పనకు ఆక్టేవ్ సంస్థ తగిన సూచనలు, సలహాలు అందించనుంది. విద్యార్థులలో సృజనాత్మక నైపుణ్యాలను పెంపొందించేందుకు హ్యాకథాన్‌లు నిర్వహించడంతో పాటు, వారికి ఇంటర్న్‌షిప్‌లు, ఉద్యోగ అవకాశాల కల్పనలోనూ ఇరు సంస్థలు సంయుక్తంగా వ్యవహరించనున్నాయి. సాంకేతిక రంగానికి అవసరమైన ప్రతిభావంతులైన యువతను తీర్చిదిద్దడమే ఈ అవగాహన ఒప్పందం ప్రధాన లక్ష్యమని విశ్వవిద్యాలయ నిర్వాహకులు వెల్లడించారు.