భారత సరిహద్దుకు సమీపంలో బ్రహ్మపుత్ర నదిపై (టిబెట్‌లో యార్లంగ్ త్సాంగ్‌పో) చైనా నిర్మిస్తున్న భారీ జలవిద్యుత్ ప్రాజెక్టు ‘వాటర్ బాంబ్’గా మారే ప్రమాదం ఉందని తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అత్యంత సున్నితమైన భౌగోళిక పరిస్థితులు, భూకంప ముప్పు పొంచి ఉన్న ప్రాంతంలో ఈ డ్యామ్ నిర్మిస్తుండటంతో, ఒకవేళ ఇది విఫలమైతే ఈశాన్య భారత్ సహా బంగ్లాదేశ్‌లో ఊహించని జలప్రళయం సంభవించవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రముఖ వ్యూహాత్మక విశ్లేషకుడు బ్రహ్మ చెల్లానీ కథనం ప్రకారం.. ఈ నిర్మాణ ప్రాంతంలోని నేల స్వభావం అత్యంత వదులుగా, బలహీనంగా ఉందని చైనాకు చెందిన భూగర్భ శాస్త్రవేత్తలే తమ పరిశోధన పత్రాల్లో వెల్లడించారు. ఈ ప్రాంతంలో ఒక మోస్తరు భూకంపం సంభవించినా డ్యామ్ నిర్మాణం దెబ్బతినే అవకాశం ఉందని, తద్వారా భారీస్థాయిలో నీరు ఒక్కసారిగా దిగువకు విడుదలయ్యే ప్రమాదం ఉందని వారు హెచ్చరించారు. అదే జరిగితే, ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే అరుణాచల్ ప్రదేశ్, అస్సాంతో పాటు బంగ్లాదేశ్‌లోని జనసాంద్రత అధికంగా ఉన్న ప్రాంతాలు జలసమాధి అయ్యే ముప్పు ఉంది.
ఈ డ్యామ్ వల్ల కేవలం ఆకస్మిక వరదల ముప్పే కాకుండా, నదీ ప్రవాహ సహజ గమనం మారడం వల్ల దిగువ ప్రాంతాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. వ్యవసాయానికి, మత్స్య సంపదకు కీలకమైన పోషకాలతో కూడిన ఒండ్రుమట్టి ప్రవాహం తగ్గిపోయి, లక్షలాది మంది జీవనోపాధి దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇప్పటికే మెకాంగ్ నదిపై చైనా నిర్మించిన డ్యామ్‌ల వల్ల దిగువ దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం.
టిబెట్ పీఠభూమిలో ఉద్భవించే నదులపై పూర్తి నియంత్రణ సాధించి, వాటిని ఒక వ్యూహాత్మక అస్త్రంగా చైనా వాడుకుంటోందని చెల్లానీ విశ్లేషించారు. ఉద్రిక్తతల సమయంలో నీటి సమాచారాన్ని పంచుకోకపోవడం, దిగువ దేశాలతో నీటి పంపకాల ఒప్పందాలను నిరాకరించడం వంటి చర్యలతో చైనా ‘జల దౌత్యానికి’ పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. సొంత శాస్త్రవేత్తలే ప్రమాద ఘంటికలు మోగిస్తున్న నేపథ్యంలో, చైనా ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించి తన బాధ్యతలను గుర్తించాలని నిపుణులు సూచిస్తున్నారు.

