TELANGANA

బర్తరఫ్ తర్వాత తొలిసారి నోరు విప్పిన కొండా సురేఖ..! సీఎం పై సంచలన కామెంట్స్!

మంత్రి పదవి నుంచి తనను తొలగించడంపై కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలకు పాల్పడ్డారని ఆరోపించారు. సురేఖను తొలగించకపోతే తాను తప్పుకొంటానని అధిష్ఠానాన్ని రేవంత్‌ బెదిరించారని ఆమె వ్యాఖ్యానించారు. లోక్‌భవన్‌ నుంచి అధికారిక ప్రకటన ఇంకా వెలువడకముందే.. తన బర్తరఫ్‌ను ఆమె ధ్రువీకరించారు. ఈ సందర్భంగా టీవీ9తో మాట్లాడిన సురేఖ పలు కీలక విషయాలను వెల్లడించారు.

తనను తొలగించే ముందు కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదని సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. తన వివరణ కూడా తీసుకోలేదని, రాజీనామా చేయాలని కూడా ఎవరూ చెప్పలేదన్నారు. అధిష్ఠానం నుంచి తనకు ఎలాంటి సమాచారం రాలేదని చెప్పారు. తనతో మాట్లాడి వివరణ తీసుకుని ఉండాల్సిందని అన్నారు.

తనపై వేం నరేందర్‌రెడ్డి, తిరుపతి రెడ్డి, కొండల్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి కుట్ర చేశారని సురేఖ ఆరోపించారు. అయితే తదుపరి కార్యాచరణపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. తాను తప్పు చేశాననే భావన లేదన్నారు.

తన కుమార్తె కొండా సుస్మిత మాట్లాడిన మాటలను పొంగులేటి సుధాకర్‌రెడ్డి రాజకీయంగా ఉపయోగించుకున్నారని ఆరోపించారు. సుస్మిత స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అని, ఆమె అభిప్రాయాలను తాము ఖండించాల్సిన అవసరం లేదన్నారు. ఆమెతో తాము మాట్లాడించలేదని స్పష్టం చేశారు.

రేవంత్‌రెడ్డిని చాలామంది విమర్శిస్తున్నా.. తన విషయంలోనే ఎందుకు ఇంత తీవ్రంగా స్పందించారో సీఎం ఆత్మపరిశీలన చేసుకోవాలని సురేఖ అన్నారు. రేవంత్‌ పీసీసీ అధ్యక్షుడు కావాలని కోరుకున్నవారిలో తామే ముందున్నామని గుర్తుచేశారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తర్వాత తాను ఎక్కువగా అభిమానించింది రేవంత్‌రెడ్డినేనని చెప్పారు.

ప్రస్తుతం పార్టీ మారే ఆలోచన లేదని సురేఖ స్పష్టం చేశారు. సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీపై తమకు అభిమానం ఉందన్నారు. 2018లో కూడా ఇదే “దుష్టశక్తులు” తనకు టికెట్‌ రాకుండా అడ్డుకున్నాయని, అందుకే అప్పట్లో బీఆర్‌ఎస్‌ వైపు చూడాల్సి వచ్చిందని చెప్పారు. అన్ని విషయాలను కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌కు వివరించినట్లు వెల్లడించారు.