AP

టీటీడీలో ఏసీబీకి చిక్కి భారీ తిమింగలం..! డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్..

ఏపీలో మరో బ్రేకింగ్ న్యూస్. తిరుమల తిరుపతి దేవస్థానం డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్టు అయ్యారు. ఆయన ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు ముగిసిన తర్వాత ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం ఉదయం నుంచి ఆయన ఇంట్లో సోదాలు చేసింది ఏసీబీ. ఆయన్ని నెల్లూరు కోర్టులో హాజరుపర్చనున్నారు అధికారులు.

తిరుమల తిరుపతి దేవస్థానంలో భారీ తిమింగలం ఏసీబీకి చిక్కింది. డిప్యూటీ ఈవో లోకనాథంను గురువారం ఉదయం ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు ఆయన ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు చేశారు ఏసీబీ అధికారులు. ఈ ఉదయం ఆయన్ని అదుపులోకి తీసుకున్న అధికారులు, ప్రస్తుతం విచారిస్తున్నారు.

సాయంత్రం నెల్లూరు ఏసీబీ కోర్టులో ఆయన్ని హాజరుపరచనున్నారు. సోదాల సమయంలో లోకనాథం ఇంట్లో భారీ ఎత్తున విలువైన ఆస్తులు ఏసీబీకి చిక్కాయి. అందులో 2 కిలోల బంగారం, 6.5 కిలోల వెండి, రూ.12 లక్షల నగదు స్వాధీనం చేసుకొన్నారు. ఆయన ఇంటిపై సోదాల వెనుక కల్తీ నెయ్యి కేసులో చిన్న అప్పన్న విచారణలో సేకరించిన ఆధారాలతో లోకనాథంపై కేసు నమోదు చేశారు.

లోకనాథం, ఆయన కొడుకు పేరిట నాలుగు ఫిక్స్ డ్ డిపాజిట్లను గుర్తించారు. తిరుపతి శ్రీనివాసనగర్‌లో ఫ్లాట్, గొల్లవానిగుంటలో రెండు ఇల్లు, వడమాలపేట మండలం పాదిరేడులో ఇల్లు కొనుగోలు చేసినట్టు గుర్తించారు. దాదాపు 24 గంటలపాటు లోకనాథంతోపాటు, ఆయన బంధువుల ఇళ్లలో సోదారు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులున్నట్లు గుర్తించారు.

మొత్తం ఏసీబీ అధికారులు ఏడు బృందాలు విడిపోయి ఐదు ప్రాంతాల్లో సోదాలు చేశారు. ఆయనకు ఐదు కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్నట్లు ఈ సోదాల్లో గుర్తించారు. మార్కెట్ విలువ అయితే రూ. 20 కోట్ల వరకు ఉండవచ్చని అంటున్నారు. ఆయన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తే కల్తీనెయ్యి కేసులో మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశమున్నట్లు టీటీడీలో అప్పుడే చర్చ మొదలైంది.