భారత్, పాకిస్థాన్ మధ్య క్రీడా సంబంధాల పునరుద్ధరణ దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. సుదీర్ఘ విరామం తర్వాత పాకిస్థాన్‌లో పర్యటించేందుకు భారత క్రీడా బృందాలకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అనుమతించినట్లు వార్తలు వెలువడ్డాయి. 2027లో పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనున్న సౌత్ ఏషియన్ ఫెడరేషన్ (శాఫ్) గేమ్స్‌లో భారత క్రీడాకారులు పాల్గొంటారని పాకిస్థాన్ మీడియా కథనాలు వెల్లడించాయి.
ఈ పర్యటనకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం లభించిందని, దీంతో భారత బృందం పాకిస్థాన్‌కు వెళ్లనుందని ఆ కథనాలు పేర్కొన్నాయి. ఈ వార్తలు నిజమైతే, పహల్గాం దాడి తర్వాత భారత క్రీడాకారులు పాకిస్థాన్ గడ్డపై అడుగుపెట్టడం ఇదే తొలిసారి అవుతుంది. గతంలో దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాల కారణంగా ఇరు దేశాల మధ్య క్రీడా కార్యకలాపాలు దాదాపుగా నిలిచిపోయిన విషయం తెలిసిందే.
భారత క్రికెట్ జట్టు చివరిసారిగా 2008లో పాకిస్థాన్‌లో పర్యటించగా, హాకీ జట్టు 2006లో ఆ దేశానికి వెళ్లింది. కాగా, 2027 శాఫ్ గేమ్స్‌లో క్రికెట్, హాకీతో పాటు మొత్తం 28 క్రీడాంశాల్లో పోటీలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భారత జట్ల పర్యటన వార్త క్రీడా వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే, దీనిపై భారత ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు

