దేశవ్యాప్తంగా విస్తృతంగా వినియోగంలో ఉన్న యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) లావాదేవీలపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) కీలక ప్రకటన చేసింది. వ్యాపారులకు చేసే చెల్లింపులపై కొన్ని రుసుములను ప్రవేశపెట్టినప్పటికీ, ఆ భారం వినియోగదారులపై పడదని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం కోట్లాది మంది యూపీఐ వినియోగదారులకు పెద్ద ఊరటనిస్తోంది.
ఎన్‌పీసీఐ తాజా నిబంధనల ప్రకారం, వ్యాపార చెల్లింపులలో (మర్చంట్ పేమెంట్స్) రూ. 2,000 దాటిన లావాదేవీలపై 0.4 శాతం రుసుము వర్తిస్తుంది. అయితే, ఈ ఛార్జీని కస్టమర్ల నుంచి వసూలు చేయకుండా వ్యాపారులే భరించాల్సి ఉంటుంది. గరిష్ఠంగా ఈ రుసుము రూ. 300 మించకుండా పరిమితి విధించారు. దీనివల్ల సాధారణ వినియోగదారులు తమ జేబు నుంచి ఎలాంటి అదనపు మొత్తం చెల్లించాల్సిన అవసరం లేదు. మొత్తం పీ2ఎం (పర్సన్ టు మర్చంట్) లావాదేవీల్లో 95 శాతానికి పైగా రూ. 2,000 లోపే ఉండటం వల్ల చిన్న వ్యాపారులపై కూడా ఎటువంటి ప్రభావం ఉండదని ఎన్‌పీసీఐ పేర్కొంది. క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, వ్యాలెట్లతో పోలిస్తే సవరించిన ఈ యూపీఐ ఎండీఆర్ రుసుములు చాలా తక్కువని వెల్లడించింది.
అదే సమయంలో రైల్వే, టెలికాం సేవలు, ఇన్సూరెన్స్, ఇంధనం వంటి కొన్ని ప్రత్యేక విభాగాల్లో రూ. 2,000 దాటిన యూపీఐ చెల్లింపులపై ఫ్లాట్‌గా రూ. 5 రుసుము వర్తిస్తుందని ఎన్‌పీసీఐ పేర్కొంది. ఈ ఛార్జీలను సైతం సంబంధిత వ్యాపారులు, సేవా సంస్థలే చెల్లించాల్సి ఉంటుంది.
మరోవైపు, ఇద్దరు వ్యక్తుల మధ్య (పీ2పీ) లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు ఉండవని, అవి ఎంత మొత్తమైనా యథావిధిగా ఉచితంగానే కొనసాగుతాయని ఎన్‌పీసీఐ స్పష్టం చేసింది. ఈ కొత్త నిబంధనలు కేవలం మర్చంట్ పేమెంట్లకే పరిమితం కావడంతో సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగదు.

