దానం నాగేందర్ అనర్హత వ్యవహారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ తీవ్రంగా స్పందించారు. పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడే నైతిక హక్కు బీజేపీకి లేదని విమర్శించారు. దానం నాగేందర్‌పై హైకోర్టు వెలువరించిన తీర్పును స్వాగతిస్తున్నామని, అయితే ఈ అంశంపై కిషన్ రెడ్డి మాట్లాడటం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు.
ఆదివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన రామకృష్ణ, బీజేపీ తీరుపై నిప్పులు చెరిగారు. తెలంగాణలో అనర్హత అంశంపై స్పందించే ముందు, దేశవ్యాప్తంగా బీజేపీ పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్న ఫిరాయింపుల గురించి కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రాంతీయ పార్టీలను విచ్ఛిన్నం చేస్తూ, ప్రజాప్రతినిధులను బీజేపీ బహిరంగంగా కొనుగోలు చేస్తోందని రామకృష్ణ ఆరోపించారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న బీజేపీకి చెందిన ఒక కేంద్ర మంత్రికి ఫిరాయింపుల గురించి మాట్లాడే అర్హత లేదని ఆయన స్పష్టం చేశారు.

