దేశంలో రాజకీయాలు ఇప్పుడు దేవుళ్ల చుట్టూ తిరుగుతున్నాయి. బీజేపీపై కాంగ్రెస్ ఎదురు దాడి తీవ్రతరం చేసింది. దేవుళ్లపై బీజేపీ వైఖరిని తప్పుబడుతూ పలు ప్రశ్నలు రైజ్ చేసింది. జైశ్రీరామ్ అని నినాదం ఎత్తుకున్న బీజేపీ, హర హర మహాదేవ్ ఎందుకనరని సూటిగా ప్రశ్నించారు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి. దీంతో ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ముఖ్యమంత్రి మాటలపై కౌంటర్ ఇచ్చేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై రకరకాల అస్త్రాలను ప్రయోగిస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే సర్ వ్యవహారంపై ఆ పార్టీ దూకుడు వెళ్తోంది. బీజేపీ శ్రీరామ్ రాజకీయాలపై పలు ప్రశ్నలు లేవనెత్తింది కాంగ్రెస్ పార్టీ. ఢిల్లీలో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీజేపీ శ్రీరాముడు ఒక రాజకీయ చిహ్నంగా మార్చిందని ఆరోపించారు. శివారాధన చేసే ద్రావిడ సంప్రదాయంతో పోలుస్తూ ఆ పార్టీ తరచుగా జై శ్రీరామ్ నినాదాన్ని ఉపయోగించడాన్ని ప్రశ్నలు లేవనెత్తారు.
మేము ద్రావిడులమని, మాకు మా సొంత సంప్రదాయాలు, నమ్మకాలు ఉన్నాయన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. మేము శివ భక్తులమని, వారు ఎక్కువగా శ్రీరాముడితో మమేకమవుతారని అన్నారు. శ్రీరాముడ్ని బీజేపీ దొంగలించిందని మనసులోని మాట బయటపెట్టారు. ఇదొక భావోద్వేగం, సెంటిమెంట్ అని చెప్పుకొచ్చారు. జైశ్రీరాం అని నినాదాలు చేసే ప్రధాని మోదీ, బీజేపీ వాళ్లు.. ఎప్పుడైనా హరహరమహాదేవ్ అని అన్నారా? ఎందుకు చెప్పరంటూ సూటిగా ప్రశ్నలు లేవనెత్తారు. బీజేపీ నాయకులు జై శ్రీరామ్ అనే నినాదాన్ని ఉపయోగించినంతగా హర హర మహాదేవ్ నినాదాన్ని బహిరంగ వేదికలపై ఎందుకు ఉపయోగించలేదని అన్నారు.
హర హర మహాదేవ ప్రస్తావనకు వచ్చినప్పుడు బీజేపీ నాయకులు దాన్ని ఇష్టపడనట్లు కనిపించారని పేర్కొన్నారు. శివుడ్ని పేదల దేవుడిగా.. శ్రీరాముడ్ని ధనికుల దేవుడిగా చెబుతారని అన్నారు. బీజేపీ ముమ్మాటికీ ధనికుల పార్టీ అని, దీని వెనుకునన సరళమైన తర్కం ఇదేనని వెల్లడించారు. సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కౌంటరిచ్చే పనిలో బీజేపీ పడింది. శ్రీరాముడు-శివుడి మధ్య రాజకీయ సరిహద్దులు సృష్టిస్తున్నారని కేంద్రమంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ ఆరోపించారు. తెలంగాణలో శివుడు-శ్రీరాముడికి సంబంధించిన ఆలయాల మతపరమైన ప్రాముఖ్యత గురించి ఆయనకు అవగాహన ఉండాలన్నారు.
వేములవాడలో దక్షిణ కాశీ, భద్రాచలంలో దక్షిణ అయోధ్య ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఉత్తర-దక్షిణ అంటూ విభజించకూడదని తెలుసుకోవాలన్నారు. ప్రధాని నరేంద్రమోదీ వారణాసి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారని, అక్కడ కాశీ విశ్వనాథుడు శివుడు అని చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు.

