TELANGANA

పాఠశాలల్లో అల్పాహార పథకం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం అమలు చేయనున్న అల్పాహార పథకం ఏర్పాట్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేగవంతం చేశారు. డిసెంబర్ 9వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని ప్రారంభించేందుకు వీలుగా నవంబర్ 30 నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ పథకంలో భాగంగా సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటుకు సంబంధించిన ఒప్పందాలు నేడు ముఖ్యమంత్రి సమక్షంలో జరిగాయి.

జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో, అత్యాధునిక వంటశాలల ఏర్పాటుకు హరేకృష్ణ ఫౌండేషన్‌కు మద్దతుగా జున్నా సోలార్ సిస్టమ్స్, చైన్ ల్యాబ్స్ ఇండియా సంస్థలు ముందుకొచ్చాయి. నాగర్‌కర్నూల్‌లో కిచెన్ ఏర్పాటుకు జున్నా సోలార్ సిస్టమ్స్ తరఫున సీఎండీ శేఖర్ రెడ్డి, సీఈఓ అనిల్ బాబు రూ. 5.17 కోట్ల చెక్కును, వికారాబాద్‌లో కిచెన్ ఏర్పాటుకు చైన్ ల్యాబ్స్ ఇండియా తరఫున ప్రతినిధి డి. సుమంత్, వైస్ ప్రెసిడెంట్ బుగత సంతోష్ కుమార్ రూ. 4 కోట్ల చెక్కును ముఖ్యమంత్రి చేతుల మీదుగా హరేకృష్ణ ఫౌండేషన్‌కు అందజేశారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులకు అందించే ఆహారంలో కేలరీలను లెక్కించేందుకు ప్రత్యేక యాప్‌లను వినియోగించాలని సూచించారు. స్థానిక ఆహారపు అలవాట్లకు అనుగుణంగా మెనూ ఉండాలని, ఆహార నాణ్యతను నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం దీర్ఘకాలం కొనసాగేలా సెంట్రల్ కిచెన్లను కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానించాలని ఆదేశించారు. విద్యార్థుల్లో పోషకాహారం విలువలను పెంచి, హాజరుశాతాన్ని మెరుగుపరచడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, హరేకృష్ణ ఫౌండేషన్ ప్రతినిధి సత్య గౌర చంద్రదాస్ స్వామీజీ తదితరులు పాల్గొన్నారు.