ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, ముఖ్యంగా విజయవాడ నగరంలో కీలక పరిణామం చోటుచేసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రముఖ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ జనసేన పార్టీలో చేరనున్నారనే ప్రచారం ఊపందుకుంది. బుధవారం ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఇటీవల వంగవీటి రాధా.. పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ భేటీల తర్వాత ఆయన పార్టీ మార్పుపై ఊహాగానాలు బలపడ్డాయి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా ఈ పరిణామం జరుగుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా, విజయవాడ మేయర్ పీఠం అన్రిజర్వ్డ్ జనరల్‌గా కేటాయించడంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.
కూటమి పొత్తులో భాగంగా విజయవాడ మేయర్ సీటును జనసేనకు కేటాయించే అవకాశం ఉందని, ఆ పార్టీ తరఫున వంగవీటి రాధా లేదా ఆయన భార్య పుష్పవల్లిని బరిలోకి దింపాలని యోచిస్తున్నట్లు సమాచారం. వంగవీటి కుటుంబానికి విజయవాడలో ఉన్న బలమైన అనుచరగణం, చారిత్రక నేపథ్యం ఈ నిర్ణయానికి కారణంగా తెలుస్తోంది. అయితే, ఇదే సీటుపై టీడీపీ నుంచి కూడా బోండా ఉమా కుమారుడు రవితేజ వంటి వారు ఆసక్తి చూపుతుండటంతో ఉత్కంఠ నెలకొంది.
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన చేరికపై మీడియా, సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతున్నప్పటికీ, పార్టీల నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

