TELANGANA

ఇంత పనికిమాలిన ప్రభుత్వం ఎప్పుడైనా చూశామా.. కాంగ్రెస్‌పై జగదీశ్‌రెడ్డి ఫైర్..!

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమని అర్హులైన ప్రతి పట్టభద్రుడి ఓటును నమోదు చేయించడమే లక్ష్యంగా బీఆర్‌ఎస్‌ శ్రేణులు పనిచేయాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జి. జగదీశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం మిర్యాలగూడ పట్టణంలోని పీఎన్‌ఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి నల్లమోతు భాస్కర్‌రావు అధ్యక్షతన నల్గొండ–ఖమ్మం–వరంగల్‌ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఓటరు నమోదు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. వచ్చే వారం రోజుల పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పూర్తి స్థాయిలో ఓటరు నమోదుపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రతి వార్డును జల్లెడ పట్టి, ఇంటింటికీ వెళ్లి అర్హులైన పట్టభద్రులను గుర్తించి ఓటరుగా నమోదు చేయించాలన్నారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీపై జగదీశ్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. గత ఎన్నికల సమయంలో ప్రజలను ఆకట్టుకునేందుకు హామీలు ఇచ్చిన కాంగ్రెస్‌కు ఈసారి పట్టభద్రులు ఓటు వేయబోరని అన్నారు. “కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్‌ తెచ్చిన కరువు” అని విమర్శించారు. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు ఏమి చేసిందని ప్రశ్నించిన ఆయన.. “ఇంత పనికిమాలిన ప్రభుత్వం ఎప్పుడైనా చూశామా?” అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పార్టీ ఈసారి ఏం చెప్పి ప్రజలను ఓట్లు అడుగుతుందని ప్రశ్నించారు. తెలంగాణకు కేసీఆర్‌ శ్రీరామరక్షగా నిలిచారని పేర్కొన్నారు.

ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్‌రెడ్డి మాట్లాడుతూ.. మిర్యాలగూడ నియోజకవర్గంలో పట్టభద్రుల ఓటరు నమోదుకు మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు చేస్తున్న కృషి స్ఫూర్తిదాయకమన్నారు. సాధారణ ఎన్నికలతో పోలిస్తే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు భిన్నమైనవని, ఇందులో ఓటరు నమోదు అత్యంత కీలకమని అన్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా బీఆర్‌ఎస్‌ గెలుస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోందని, అయితే అధిక సంఖ్యలో పట్టభద్రుల ఓట్లు నమోదైతేనే ఆ విజయాన్ని సాధించగలమని అన్నారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ విజయం సాధించడంతో పార్టీ జైత్రయాత్రకు శ్రీకారం చుడుతుందని పేర్కొన్నారు. పట్టభద్రులకు రక్షణ కవచంలా ఉంటానని హామీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు మాట్లాడుతూ.. పట్టుదలతో పనిచేసి పట్టభద్రుల ప్రతి ఓటును బాధ్యతగా నమోదు చేయిస్తామన్నారు. అర్హత ఉన్న ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా చర్యలు తీసుకుంటామని, ఉమ్మడి మూడు జిల్లాల్లో మిర్యాలగూడ నియోజకవర్గాన్ని ఓటరు నమోదులో మొదటి స్థానంలో నిలిపేందుకు సమష్టిగా కృషి చేస్తామని తెలిపారు.