హైదరాబాద్‌లో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి పరిష్కారం చూపడంతో పాటు ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు సంబంధించి నిధులు మంజూరు చేస్తూ పరిపాలనా ఉత్తర్వులు జారీ చేసింది. రెండో దశ (ఫేజ్-2) పనుల కోసం రూ.150 కోట్లు, ప్రభుత్వ రుణాల పద్దు కింద మరో రూ.125 కోట్లు కేటాయించింది.
నగరంలో పెరుగుతున్న జనాభా, ఐటీ, పారిశ్రామిక రంగాల విస్తరణకు అనుగుణంగా మెట్రో నెట్‌వర్క్‌ను శివారు ప్రాంతాలకు విస్తరించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. తాజా నిధులతో ఫేజ్-2కు సంబంధించిన సాధ్యాసాధ్యాల అధ్యయనాలు, ప్రాథమిక పనులు, ప్రతిపాదిత కారిడార్ల సర్వేలు వేగవంతం కానున్నాయి.
రెండో దశలో శంషాబాద్ విమానాశ్రయం, ఐటీ హబ్ పరిధిలోని రాయదుర్గం-కోకాపేట, పాతబస్తీ పరిధిలోని ఎంజీబీఎస్-చంద్రాయణగుట్టతో పాటు ఇతర శివారు ప్రాంతాలను కలిపే కారిడార్లను ప్రతిపాదించారు.
మరోవైపు ప్రభుత్వ రుణాల పద్దు కింద కేటాయించిన రూ.125 కోట్లతో మెట్రో ప్రాజెక్టు నిర్వహణ, ఆర్థిక బకాయిలకు సంబంధించిన అవసరాలను సమతుల్యం చేయాలని భావిస్తున్నారు. ఈ నిధుల కేటాయింపుతో ఫేజ్-2 పనులకు సంబంధించిన తదుపరి చర్యలు ముందుకు సాగనున్నాయి.

